
* ఇంటికి సాగనంపాలి
* టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి - కోటబొమ్మాళి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రమాదకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. స్థానిక టిడిపి కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గ టిడిపి నాయకులు, క్లస్టర్, బూత్ లెవల్, యూనిట్ ఇన్‌ఛార్జీలతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లోనూ వెనుకబడిందని విమర్శించారు. ఎక్కడా అభివృద్ధి జాడే లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడం ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ ఇన్‌ఛార్జీలు ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ అందించబోయే పథకాలను ప్రమాణపత్రం ద్వారా ప్రజలకు అందించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టిడిపి ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ఇవీ అని వివరించాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్‌కి బాబు గ్యారంటీ అని అన్నారు. మహాశక్తితో మహిళలకు భరోసాగా నిలుస్తారని తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయ అవరణలో నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ సముదాయం గల షెడ్‌ను అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అనంతరం ఇటీవల నిర్వహించిన సంతబొమ్మాళి పంచాయతీ ఎన్నికల్లో 12వ వార్డు మెంబర్‌గా గెలుపొందిన టిడిపి నాయకులు చమళ్ళ అనసూయమ్మను సత్కరించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, మండల అధ్యక్షులు బోయిన రమేష్, మాజీ ఎంపిపిలు వెలమల విజయలక్ష్మి, టి.రామకృష్ణ, వెలమల కామేశ్వరరావు, నాయకులు కె.నాగయ్యరెడ్డి, లక్ష్మణ్‌రెడ్డి, దేవాది సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.