Jul 10,2023 21:08

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

        ప్రజాశక్తి-పుట్లూరు   అనంతపురంలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహించనున్న రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈమేరకు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధిలోని కడవకల్లు గ్రామంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న భారాలపై చర్చించేందుకు రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎంఎ బేబీ, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌, పార్లమెంట్‌ మాజీ సభ్యులు పి.మధు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను సమీక్షించి భవిష్యత్‌ కర్తవ్యాలను రూపొందించనున్నట్లు తెలిపారు. వీటన్నిటిపై రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించి జులై 13న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు రైతులు, కూలీలు, కార్మికులు పెద్దఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.సూరి, ఎపి రైతుసంఘం మండల కార్యదర్శి జి.వెంకటచౌదరి, నాయకులు టి.పెద్దయ్య, బి.భాస్కర్‌రెడ్డి, కె.నాగభూషణం, ఆటం ఆదెప్ప, నరేంద్ర, రాజేష్‌, నాగార్జున, నరసింహా, తదితరులు పాల్గొన్నారు.