Oct 25,2023 21:47

ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు నాయకులు

రాష్ట్ర సదస్సు జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : నెల్లూరు నగరంలో జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో 27న జరగనున్న అసంఘటిత కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర నాయకులు, మాజీ ఎంఎల్‌ఎ ఎం.ఎ.గఫుర్‌, సిఐటియు రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఉమామహేశ్వరరావు హాజరవుతారని సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసంఘటిత, భవన, అమాలి, ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో పనిచేసే రైస్‌మిల్లు, రోడ్డు మార్గం తదితర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సదస్సులో చర్చ జరుగుతుందని భవన కార్మికులు మన రాష్ట్రంలో సక్రమంగా పనులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి వెల్ఫేర్‌ బోర్డులో డబ్బులు ఉన్నప్పటికీ కార్మికులకు ఇచ్చి ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
అంతేకాకుండా వారి బోర్డులో ఉన్న సుమారు రూ.1280 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వేరే సంక్షేమ పథకాలకు మళ్లించిందని, చాలా అన్యాయమన్నారు. ఆటో కార్మికులు, వీధి వ్యాపారులు కుటుంబాలు గడవక అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారిని ఆదుకోవడం లేదని తెలిపారు. ఎన్నికలప్పుడు ప్రభుత్వాలు అందరినీ ఆదుకుంటామని ఉపాధి కల్పిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలు వారి ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భవన కార్మికులతో పాటు అసంఘటిత కార్మికులందరికీ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆర్థికసాయాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 27వ తేదీన జరిగే అసంఘటిత కార్మికుల రాష్ట్ర సదస్సుకు భవన కార్మికులు, ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో ఆటో కార్మికులు, చిన్న వ్యాపారులు అందరూ పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి.మధుసూదన రావు, వి.బాబురావు పాల్గొన్నారు.