ప్రజాశక్తి - ఉండి
పెదపుల్లేరు గ్రామ సహకార సంఘం మాజీ ఛైర్మన్ కలిదిండి రామచంద్రరాజు (పెదపుల్లేరు రామం) శనివారం మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని అటవీశాఖ కార్పొరేషన్ డైరెక్టర్, వైసిపి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మంతెన యోగేంద్రబాబు ఆదివారం పరామర్శించి రామచంద్రరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యేగేంద్రబాబు మాట్లాడుతూ కాస్మో పొలిటన్ క్లబ్ వ్యవస్థాపకులుగా కలిదిండి రామచంద్రరాజు సుపరిచితులన్నారు. తనను నమ్ముకున్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేవారన్నారు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. వైసిపి సోషల్ మీడియా పశ్చిమగోదావరి జిల్లా కో ఇన్‌ఛార్జి పాటూరి శ్రీనివాస దొరబాబు మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావడానికి కలిదిండి రామచంద్రరాజు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారన్నారు. పార్టీలకు అతీతంగా అందరితో ఎంతో సఖ్యంగా ఉండేవారన్నారు. కలిదిండి రామచంద్రరాజు కుటుంబానికి గొల్లలకోడేరు ఉప సర్పంచి శ్రీనివాస్ వర్మ, తిరుపతిరాజు, కలిదిండి భాస్కర్ రాజు, కూనపరాజు రంగరాజు సానుభూతి తెలిపారు.










