Oct 24,2023 20:08

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు
రామాయపట్నం పోర్టు నిర్వాసితుల ఆవేదన
మాయమాటలు చెప్పి ఇల్లు ఖాళీ చేయించారు
ప్రజాశక్తి-గుడ్లూరు:రామాయపట్నం పోర్టు నిర్వాసితల గ్రామాలైన ఆవులు వారి పాలెం, మొండి వారి పాలెం, కర్లపాలెం గ్రామాలను సిఐటియు ప్రతినిధుల బందం సభ్యులు పర్యటించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు, జిల్లా నాయకులు జి. వెంకటేశ్వర్లు, పి. పెం చలయ్య, జివిబి కుమార్‌, హైకోర్టు అడ్వకేట్‌ ఎన్‌ కష్ణమూర్తి, స్థానిక నాయకులు నూతలపాటి వెంకటేశ్వర్లు, ఇరువురి బ్రహ్మయ్య పాల్గొన్నారు. నాయకుల ఎదుట నిర్వాసిత గ్రామాల వారు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. రామాయపట్నం పోర్టు కారణంగా ఇంటికి ఒక ఉద్యోగం, మూడు సంవత్సరాల పాటు నెలకి బస్తా బియ్యం, రోజుకి మహిళలకు రూ.350, పురుషులకి రూ.450 ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రతి నిర్వాసిత కుటుంబానికి అందజేయడం జరుగుతుందని అధికారులు హామీ ఇచ్చారు. అధికారులు మాటలు నమ్మి సాగు భూములు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయమన్నారు. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో వారు ఇచ్చిన డబ్బులు సలహా అప్పు చేసి ఇల్లు కట్టుకున్నామన్నారు.
చివరికి తమకు ఏమీ మిగలలేదని నిర్వాసితులు నాయకులు ఎదుట వాపోయారు. ప్యాకేజీ వచ్చిందని తొలిసారిగా ఒక బస్తా బియ్యం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఉద్యోగం ఊసే లేదు. సముద్ర తీరంలో చేపల పట్టుకుని హాయిగా జీవనం సాగించే వాళ్లం. ఇల్లు ఖాళీ చేయగానే అధికారులు చూపిన అడవుల్లోకి పోయి అవస్థలు పడుతున్నామన్నారు. అనారోగ్యం పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలు ఖాళీ చేశాక ఏడాదికాలంగా వేట లేదు పనుల్లేవు. ఎలా బతకాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నాం. నానా తంటాలుపడి ఇల్లు కట్టుకున్నా, అన్నం దొరకక అవస్థ పడుతున్నామన్నారు. ఇంటి కోసం అధికారులు ఇచ్చిన డబ్బులు చాలక కొంతమంది రేకుల షెడ్డు నిర్మించుకొని తల దాచుకుంటున్నామన్నారు. ఇసుక, ఇటుక ఇస్తామన్నారు. ఇసుక అందకుండా చేసేశారు. ఇసుక లేకుండా ఇల్లు ఎలా నిర్మించుకోవాలి, చేపల పట్టుకుని జీవనం సాగించే మాకు ఏడాదికాలంగా చేపల దొరకడంలేదు. దీంతో ఇతర తీర ప్రాంత గ్రామాల వారి దగ్గర చేపలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది అని వాపోయారు.
2013 ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు డిమాండ్‌ చేశారు. కర్లపాలెం ఆవుల వారి పాలెం, మొండి వారి పాలెం నిర్వాసితులకు న్యాయం చేసే వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు. పోర్టు కోసం అన్ని వదులుకొని త్యాగం చేసిన నిర్వాసితులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. పోర్టు నిర్మాణం కోసం సర్వం వదులుకున్న నిర్వాసితులను అభినందించారు. నిర్వాసితుల త్యాగం గురించి కొనియాడారు. ఇంత త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రభుత్వం ఏమి చేసిందని, అవసరం తీరాక మొండి చేయి చూపడం ప్రభుత్వానికి ఇది న్యాయమేనా అన్నారు. సర్వం కోల్పోయిన నిర్వాసితుల ప్రజలకి ఇన్ని బాధలు పెట్టడం వారికి రావాల్సిన పూర్తి నష్టపరిహారం చెల్లించకపోవడం ప్రభుత్వం డబ్బులు మిగిల్చి ఎవరిని ఉద్ధరించడానికి అని అన్నారు. పోర్టు నిర్వాసితుల కోసమా లేక అదానీకోసమా అని ప్రశ్నించారు. కాకులను కొట్టి గద్దలకు వేయడం అంటే ఇదేనేమో అని అన్నారు. ప్రభుత్వ తీరు వలన బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం వారికి ఇస్తానన్న ప్యాకేజీ ప్రకారం నెలకి రూ.15వేలు వంతున మూడు సంవత్సరాలు పాటు చెల్లించాలని, ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లు సాధన కోసం మూడు గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. నిర్వాసితులకి సిఐటియు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. యువతకి స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఓడల కోసం జెట్టి నిర్మించాలన్నారు. నిర్వాసితుల గ్రామాల్లో గుడ,ి బడి, వైద్యశాల ఏర్పాటు చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా ప్యాకేజీ వర్తింపచేయాలని, ప్రజలు వ్యాధులు బారిన పడకుండా దుర్గంధం వెదజల్లే రొయ్యల ఫ్యాక్టరీలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.