ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్, యంత్రాంగం
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల గురించి విద్యార్థులలో అవగాహన పెంచడానికి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ. కరుణ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా న్యాయ సేవ భవనంలో రోప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ధన శేఖర్‌తో కలసి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు, పారా లీగల్ వలంటర్‌లకు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. రోప్ స్వచ్చంద సంస్థ ద్వారా విద్యార్థులకు నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు. అనంతరం ఆర్ కె యం లా కళాశాల నందు ప్రిన్సిపాల్ జనార్దన్ రెడ్డితో కలసి నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాల గురించి అవగాహన కల్పించాలన్నారు పేద ప్రజలకు న్యాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు.
నెహ్రూ యువ కేంద్రం చిత్తూరు ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నిర్వహించారు. నెహ్రూ యువకేంద్ర జిల్లా యువజన అధికారి బి.ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌరహక్కులు, చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.మోహన్‌రెడ్డి, సిబ్బంది కోమల, జిబిరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు.
రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు : కలెక్టర్
'దేశ పౌరులుగా మనమందరం రాజ్యాంగ దినోత్సవాన్ని గుర్తుంచుకుని గర్వించాలి' అని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ తెలిపారు. శనివారం జిల్లా సచివాలయం లోని గ్రీవెన్స్ హాల్ నందు జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా. బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమము లో జెసి డా.ఎస్.వెంకటేశ్వర్, డిఆర్‌ఓ ఎన్. రాజశేఖర్, ట్రైనింగ్ కలెక్టర్ మేఘ స్వరూప్, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ప్రస్తావన ప్రతిజ్ఞను కలెక్టర్ తో పాటు జె సి, డి ఆర్ ఓ, ట్రైనీ కలెక్టర్, కలెక్టరేట్ సిబ్బంది చదివారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యాంగ విలువలు కాపాడుకోవాలి
జెడ్పి వైస్ ఛైర్మెన్
ప్రపంచ రాజ్యాంగాలన్నింటి కన్నా భారత రాజ్యాంగం అత్యంత ముఖ్యమైనదని, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాజ్యాంగ హక్కులు విలువలు కాపాడే విధంగా అందరూ నడుచుకోవాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాల సందర్భంగా రాజ్యాంగ దినం రావడం ఈ సందర్భంగా ఉద్యోగులందరూ రాజ్యాంగ దినం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించుకొనేందుకు డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యులుగా బిఆర్ అంబేద్కర్ మరికొందరు 1947 ఆగస్టు 14 రాత్రి సమావేశమై భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా 136 సార్లు రాజ్యాంగ కమిటీ సమావేశం జరిపి 1949, నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ప్రకటించడం జరిగిందన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాతకు పులువురి నివాళి
72వ రాజ్యంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, దళిత, విద్యార్థి సంఘాల నేతలు స్థానిక దర్గా సర్కిల్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ప్రభుత్వాలు రాజ్యాంగ హక్కులను కాలర్రాస్తున్నాయంటూ దళిత సంఘాల నేతలు ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అధ్యక్షులు ప్రభుతేజా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలు తుంగలో తొక్కి ప్రజల హక్కులను హరిస్తున్నాయన్నారు. నాటి అంబేద్కర్ సూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
.










