
ప్రజాశక్తి- శ్రీకాకుళం లీగల్: రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని జిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు అన్నారు. ప్రపంచ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) ఆధ్వర్యాన 'భారత రాజ్యాంగం - ప్రస్తుత పరిస్థితులు' అనే అంశంపై శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం ప్రధాన కార్యదర్శి డొంకాన ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. సీనియర్ న్యాయవాదులు కూన అన్నంనాయుడు, ఆగూరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల్లో మరింత చైతన్యవంతంతో ముందుకొచ్చి కాపాడాలన్నారు. న్యాయవాది బి.మురళీకృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం సాధ్యపడిందన్నారు. కానీ, ఆ సామాజిక న్యాయం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిసి న్యాయవాద సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎ.ఉమామహేశ్వరరావు, చౌదరి లక్ష్మణరావు, ఐలు జిల్లా అధ్యక్షులు దుంపల రమణారావు, ఐలు, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పైడి లక్ష్మీపతి, దొంకాన ఈశ్వరరావు, చక్రధర్, సువ్వారి వెంకటరమణ, సూర అప్పలనాయుడు, డి.ఇంద్రనాగమోహన్, చలపతిరావు, గౌరవ అధ్యక్షులు అంధవరపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. a