వైఎస్ వర్థంతి సభల్లో వక్తలు
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్, నగరి, యంత్రాంగం
జిల్లావ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సభలు జరిగాయి. రాజన్న స్ఫూర్తితో జగనన్న పాలన సాగుతోందని వక్తలు ఉద్ఘాటించారు. జీడీనెల్లూరు మండలం కలిజవేడు గ్రామంలో రాజశేఖర్‌రెడ్డి వర్థంతి పురస్కరించుకుని డిప్యూటీ సిఎం నారాయణస్వామి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ విద్యార్థుల చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టిన కారణంగా చాలామంది పిల్లలు ఇంజినీరింగ్, డాక్టర్ విద్యను అభ్యసిస్తున్నారన్నారు. తండ్రి అడుగు జాడల్లోనే జగన్మోహన్‌రెడ్డి నడుస్తూ నవరత్నాల పేరుతో పథకాలను ప్రవేశపెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేశారన్నారు. సచివాలయాలు, వెల్‌నెస్ సెంటర్లు, ఆర్‌బికెలను ఏర్పాటు చేశారన్నారు. కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్యా, ద్వేషం లేకుండా ప్రేమ, అనురాగంతో ప్రజలకు సేవ చేస్తున్న ముఖ్యమంత్రికి రాజశేఖర్‌రెడ్డి ఆశిస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు.
డిసిసిబి ఛైర్మన్ రెడ్డెమ్మ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, చుడ ఛైర్మన్ పురుషోత్తంరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటి ఛైర్మన్ రాహుల్ రాజారెడ్డి, నగర మేయర్ అముద, విదేశీ వ్యవహారాల ఇన్‌ఛార్జి జ్ఞానేంద్రరెడ్డి ఆధ్వర్యంలో డిసిసిబి ఆవరణలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. డిసిసిబి ఛైర్మన్ రెడ్డెమ్మ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మనముందు లేకున్నా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జగన్మోహన్‌రెడ్డి ప్రజల ఆదరణ పొందుతున్నారన్నారు.
వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం దాసరి కాలనీలో జడ్‌పిటిసి సుకుమార్, ఎంపిపి నాగరాణి, మాజీ జడ్‌పిటిసి సుకుమార్, ఎంపిపి నాగరాణి, మాజీ జడ్‌పిటిసి సబ్యులు బండి గోవర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సదుం బస్టాండ్ కూడలిలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. గంగవరం మండలంలో మండల కన్వీనర్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచుల అధ్యక్షులు గిరిజారెడ్డి, చలపతిరెడ్డి, జడ్‌పిటిసి పార్వతి, చంద్రప్ప పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌పురం కొత్తపల్లి మిట్ట బస్టాండ్ ప్రధాన కూడలిలో డిసిసిబి డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి, సర్పంచి డివి డిల్లయ్య ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. అనంతరం పేదలకు పాలు, పండ్లు, అన్నదానం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి, జడ్‌పిటిసి రమణ ప్రసాద్‌రెడ్డి, ఎంపిపి సరిత తండ్రి జనార్ధన్ పాల్గొన్నారు. కార్వేటినగరం మండలంలో ఎంపిడిఒ ఆర్చి వద్ద వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఎంపిపి లతా బాలాజీ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. మండల కన్వీనర్ ధనంజయవర్మ, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి ధనంజయరెడ్డి, ఎఎంసి ఛైర్మన్ కృష్ణయాదవ్, కోఆపరేటివ్ మెంబర్ పట్నం ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపిపి నాయకులు ధనశేఖర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు బస్టాండ్‌లో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాష, ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డియాదవ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు, బంగారుపాళ్యం మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఎంఎల్‌ఎ ఎంఎస్‌బాబు, మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. అనంతరం కరిడివారిపల్లి గ్రామంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి, జెడ్పిటిసి సోమశేఖర్, వైస్ ఎంపీప,ీ శిరీష్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి, తహశీల్దార్ బెన్‌రాజ్ పాల్గొన్నారు.
నగరిలో ఎప్పటిలానే...
మంత్రి ఆర్‌కె రోజా ఇలాకాలో వైఎస్‌ఆర్ వర్థంతి పురస్కరించుకుని ఎప్పటిలానే విభేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి రోజా వర్సెస్ కెజె కుమార్ గ్రూపులుగా ఉన్నాయి. పంచ పాండవులుగా కెజె కుమార్ (నగరి), అమ్ములు (పుత్తూరు), చక్రపాణి రెడ్డి (నిండ్ర), మురళిరెడ్డి (వడమాలపేట), లక్ష్మీపతి రాజు (విజయపురం) ఉన్నారు. మంత్రి ఆర్‌కె రోజా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండడంతో ఆమె తరపున రోజా సోదరుడు రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి - చెన్నరు జాతీయ రహదారి కూడలిలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నగరి ఓంశక్తి గుడి నుంచి నగరి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్నదానంచేశారు. కెజెకుమార్ గ్రూప్ సంబంధించి కెజెకుమార్ కార్యాలయం నుంచి టవర్‌క్లాక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్డు, పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి, మురళీధర్‌రెడ్డి, లక్ష్మీపతిరాజు, అమ్ములు, కెజె శాంతికుమారి మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి మొట్టమొదటిసారిగా పార్టీ జెండాను ఏర్పాటు చేసిన తమను పక్కన పెట్టి అప్పట్లో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు అడ్డంకులు సృష్టించి దౌర్జన్యానికి పాల్పడిన వారు ప్రస్తుతం వైఎస్‌ఆర్ ప్రభుత్వంలో లబ్ది పొందుతున్నారన్నారు. వాళ్లలా తాము వెన్నుపోటు రాజకీయాలు చేయకుండా ఎప్పటికీ జగన్న వెంటే నడుస్తామని అన్నారు.










