గాలి భానుప్రకాష్ భవితవ్యం ఏంటి?
స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో , నగరి
బుధవారం నగరి ఒకటో వార్డులో సామాలమ్మ గుడి వద్ద పూజలు చేశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని, అయితే ఏ పార్టీ తరపున అన్నది అప్పటి పరిస్థితులను బట్టి వెల్లడిస్తానని చెప్పారు. స్వతంత్రంగానైనా బరిలో దిగేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఒకవేళ టిడిపి నుంచి ఆమె పోటీ చేస్తే ఇప్పటివరకూ నగరి నియోజకవర్గంలో టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్న గాలి భానుప్రకాష్ భవితవ్యం ఏంటన్నది ప్రశ్నార్ధకం కానున్నది.
బుధవారం నగరిలో సామాలమ్మ గుడి వద్ద పూజలు చేసిన సినీనటి వాణీ విశ్వనాథ్ 'ప్రజాసేవ కోసం నగరి నుంచి పోటీ చేయడం తథ్యం' అని స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంలో తన అభిమానులు వేలాదిగా ఉన్నారని, అభిమానుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఏ పార్టీ తరపున పోటీ చేసేది ఇప్పుడే చెప్పలేనని, అప్పటి పరిస్థితులను బట్టి ప్రకటిస్తానని తెలిపారు. తన మేనేజర్ రామానుజం చలపతికి రాజకీయంగా జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేకనే తాను ఎన్నికల బరిలో నిలవడానికి సిద్ధపడినట్లు తెలిపారు. నలుగురికి సాయం చేసే వ్యక్తికే ఇలా ఇబ్బందులు ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు. సామాలమ్మ గుడి వద్ద పూజలు చేయడానికి విచ్చేసిన వాణీ విశ్వనాధ్‌కు టిడిపి మహిళలు, కౌన్సిలర్లు మంగళ హారతులతో స్వాగతం పలికారు. సామాలమ్మకు ధూపదీప నైవేద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు. రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి మొదటి విడతగా ఈ దేవాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. నగరిలో తన అమ్మమ్మ నర్సుగా పనిచేశారని, ఈ ప్రాంతవాసులు తనకు సుపరిచితమని తెలిపారు. నగరిలో తమిళ సంస్కృతి సైతం ఉందని, అందుకే నగరి నుంచి పోటీచేయనున్నట్లు చెప్పారు. అనివార్యమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో దిగుతానన్నారు. ఈ కార్యక్రమంలో రామానుజం చలపతి, ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ లత, లక్ష్మీ, అలిమేలు, కన్నెమ్మ, ఆదెమ్మ, భారతి, మణివన్నన్, వరదన్, అరుణ్ పాల్గొన్నారు.










