చిత్తూరు : చిత్తూరు మాజీ ఎంపి డికె ఆదికేశవులు నాయుడు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కుమారుడు డి.ఎ.శ్రీనివాస్ పై రాజకీయ కుట్రతో తప్పుడు ఆరోపణలు రావడాన్ని ఖండిస్తున్నట్లు చిత్తూరు బలిజ సంఘం నేతలు తెలిపారు. ఆదివారం చిత్తూరు బలిజ సంఘం కార్యాలయంలో బలిజ సంఘం అధ్యక్షుడు ఒ.ఎం.రామదాసు, బలిజ సంఘం నేత కాజూరు బాలాజీ మాట్లాడుతూ ... నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ఎన్నో అభివఅద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఆదికేశవులు కుటుంబం ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. వైద్య, విద్య, పారిశ్రామిక రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటున్న వారిపై తప్పుడు ఆరోపణలు రావడం శోచనీయమన్నారు. తనకు ప్రమేయం లేని కేసులో శ్రీనివాస్ ను అక్రమంగా ఇరికించారన్నారు. బెంగళూరులో ఈనెల 23న నార్కోటిక్ కంట్రోల్ బోర్డు (ఎన్‌సీబీ) అధికారులు ఎయిర్ పోర్టులో ఒక అరేబియన్ మహిళను అరెస్టు చేశారని అన్నారు. ఆమె వద్ద 7.5 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారని కేసు నమోదు అయిందన్నారు. విచారణలో ఆమె గతంలో తాను ఇందాద్ ఖాన్ అనే వ్యక్తికి 1.5 కిలోల మాదక ద్రవ్యం ఇచ్చినట్లు తెలిపిందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్ సిబి అధికారులు అతడుండే స్థలానికి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఆ వ్యక్తి ఇందాద్ ఖాన్ ఒకప్పుడు బెంగళూరు మాల్యా ఆసుపత్రిలో పనిచేసేవాడని చెప్పారు. ప్రస్తుతం అతడు సదాశివ నగర్ లో గెస్ట్ హౌస్ లో పని చేస్తున్నాడనీ, అతనికి ఫోన్ చేసి ట్రాక్ చేసి ఇంటరాగేషన్ చేయగా ఈ గెస్ట్ హౌస్ శ్రీనివాస్ కి సంబంధించినది అని తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో గెస్ట్ హౌస్ ను తనిఖీ చేయగా అందులో ఎలాంటి మాదక ద్రవ్యాలు దొరకలేదని చెప్పార. గెస్ట్ హౌస్ యజమానిగా ఉన్న శ్రీనివాస్ ను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో శ్రీనివాస్ కు ఎలాంటి ప్రమేయం లేదని మరోసారి స్పష్టం చేశారు. కేవలం పని మనిషి చేసిన తప్పిదానికి యజమానిని బలి చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పుడూ ప్రజాసేవలో ఉండే శ్రీనివాస్ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడబోరని ఈ సందర్భంగా బలిజ సంఘం నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘ నేతలు అప్పోజీ, విశ్వనాధ్, టిక్కీ రాయల్, వరదరాజులు, బాలాజీ, రమేష్, లోకనాథం, రమణ, మోహన్, తదితరులు పాల్గొన్నారు.










