Feb 24,2023 23:16

యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి - ఢిల్లీ ధర్నాలో యుటిఎఫ్‌ జిల్లా నేతలు
ప్రజాశక్తి - భీమవరం

                ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి హెచ్చరించారు. విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్కూల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ, ధర్నాలో జిల్లాకు చెందిన యుటిఎఫ్‌ నేతలు పాల్గొన్నారు. అక్కడ జరిగిన ధర్నాలో గోపీమూర్తి మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని క్రమబద్దీకరించాలని కోరారు. విద్యా హక్కు చట్టాన్ని 12వ తరగతి వరకు విస్తరింపజేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. రూ.7.50 లక్షలు ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని, రూ.2.50 లక్షలు వరకు స్టాండర్డ్‌ డిటెక్షన్‌ ఉండాలని, 80 సీసీ మినహాయింపు రూ.మూడు లక్షల వరకు ఉండాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ధర్నాలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయరామరాజు, జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.మార్కండేయులు, జిల్లా కోశాధికారి సిహెచ్‌.పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు ఎస్‌.రత్నరాజు, పి.క్రాంతికుమార్‌, ఎం.శ్రీనుబాబు, కె.త్రిమూర్తులు, అజరు శాంసన్‌, శ్రీలక్ష్మి, జి.సుధాకర్‌, కె.నాగరాజు, ఆర్‌ఎల్‌ఎన్‌.మూర్తి పాల్గొన్నారు.