
ప్రజాశక్తి-నౌపడ : నౌపడలోని నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీ పనులను కలెక్టర్ కేస్ బి లాఠకర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ చివరకల్లా స్థలాన్ని మట్టి నింపి చదును చేయాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ నెలలో ప్లాట్లు గుర్తించి లాటరీ పద్ధతి ద్వారా పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఆర్ అండ్ ఆర్ కాలనీకి ఉప్పునీరు పడుతుందని పరిష్కారం చూపాలని నిర్వాసితులు కలెక్టర్ ను కోరారు. ఆర్ అండ్ ఆర్ కాలనీకి ఐదు కిలోమీటర్లలో ఉన్న తేలినిలాపురం నుంచి బోర్లు ద్వారా నీరు తరలించి కాలనీలో ట్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు. ట్యాంకుల ద్వారా ప్రతి వ్యక్తికి రోజుకు వంద లీటర్లు చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్ అండ్ ఆర్ కాలనీకి డ్రైనేజీ వ్యవస్థ పక్కా ప్రణాళికలతో నిర్మించాలని ఆర్ డబ్లూయ్ ఎస్ డిపార్ట్మెంట్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నూరూల్ కమర్, ట్రైనీ కలెక్టర్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.