Jun 03,2023 16:07
  • ఈసారైనా పనులు ఆగకుండా కొనసాగేనా అంటున్న స్థానికులు..

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పలలో ప్రధాన సమస్య అయిన కుతలేరు వంతెన నిర్మాణం ఈ వంతెన నిర్మాణ పనులు గత నాలుగు సంవత్సరాల నుండి పనులు ప్రారంభం కావడం నాలుగు రోజులు పనులు జరగడం నాలుగు నెలలు నిలిచిపోవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో నార్పల కూతలేరు వంతెన నిర్మాణం మరో పోలవరం సమస్యగా మారిపోయింది అని స్థానికులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడు పార్టీలు మూడు ప్రభుత్వాలు మారిన అందరూ కూతలేరు వంతెన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పిన వారే కానీ పూర్తిచేసే వారే కరువయ్యారు. మొత్తానికి ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ఒక అడుగు ముందు వేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సమస్యలను అధిగమించి కూతలేరు వంతెనపై శిథిలావస్థకు చేరిన పాత వంతెనను తొలగించి నూతన వంతెన పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో మండల ప్రజల సమస్య తీరినట్లేనని అందరూ ఆనందపడ్డారు. కర్ణుని మరణానికి సవాలక్ష కారణాలు అన్నచందంగా ప్రారంభమైన పనులు నత్త నడకన కొనసాగుతూ, కొనసాగుతూ త్వరలోనే నిర్మాణం పూర్తి అయితుందని సంవత్సర కాలం నుండి రేపు మాపు అని స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రమైన అనంతపురంలో పనులు మొదలుపెట్టిన రెండు సంవత్సరాల లోపల ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని నాలుగు సంవత్సరాలయిన నార్పల కూతలేరు వంతెన నిర్మాణం మాత్రం పూర్తీ కాలేదని ప్రజాప్రతినిధులు అధికారులు పనులు అప్పగించేటప్పుడే మంచి గుత్తేదారుని చూసి నిర్ణయిత గడువుని నిర్ణయించి పనులు అప్పగించి ఉంటే బాగుండేదని ఎవరో చేసిన తప్పులకు వంతెన నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేసిన ప్రజాప్రతినిధులు అధికారులు సైతం అభాసుపాలవుతున్నారని గతంలో పాలకులు తమ చేత కాదంటూ వంతెన నిర్మాణానికి ముందుకు రాలేదని గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నచందంగా పాత వంతెనతోనే పనులు జరిగేవని ప్రస్తుతం పాత వంతెనపాయే ఉన్నవంతర పూర్తి కాకపాయే అన్న విధంగా మారిపోయింది. ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నార్పలకు వస్తున్న సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కూతలేరు వంతెన పూర్తి అవుతుందని భావించిన నార్పల ప్రజలకు నిరాశ తప్పలేదు. ముఖ్యమంత్రి బహిరంగ వేదికకు బస్సులో కూతలేరు వంతెన పక్కనుండే ప్రయాణం చేస్తారు సమస్యను చూసి వెంటనే పరిష్కరిస్తారు అని స్థానికులు భావించారు స్థానికుల అంచనాలను తారుమారు చేస్తూ ప్రజాప్రతినిధులు అధికారులు కూతలేరు వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టి లో పడకుండా వంతెన నిర్మాణ పనులు మొత్తం ఫ్లెక్సీల ముసుగులో కప్పి పెట్టారు. మండల కేంద్రమైన నార్పలకు ముఖ్య మంత్రి వచ్చి బహిరంగ సభలో పాల్గొంటే ఎమ్మెల్యే పద్మావతి నార్పలలో ప్రధాన సమస్య అయినటువంటి కూతలేరు వంతెన గురించి అసలు ప్రస్తావించకపోవడం స్థానికులను మరింత వేదనకు గురిచేసింది. ప్రస్తుతం ప్రారంభమైన కూతలేరు వంతెన పనులు పూర్తి అయ్యే వరకు కొనసాగుతాయో లేకపోతే నాలుగు రోజులు కొనసాగి మళ్లీ పనులు నిలిచిపోతాయో వేచి చూడాల్సిందేనని పలువురు చర్చించుకుంటున్నారు.