- సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున
ప్రజాశక్తి-రాయదుర్గం : ఉద్యమ నిర్మాతగా సుందరయ్య వారసత్వాన్ని కొనసాగిస్తామని, ఆయన ఆశయాల సాధనకై ఉద్యమిస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి మల్లికార్జున తెలిపారు. శుక్రవారం సిపిఎం దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని పురస్కరించుకుని రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలిలో పార్టీ నాయకత్వంతో కలిసి పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ, పుచ్చలపల్లి సుందరయ్య నిస్వార్థ ప్రజా సేవకుడని, ఆయన నిత్యం ప్రజల కోసం కార్మికుల కోసం రైతుల కోసం వ్యవసాయ కూలీల కోసం అనేక పోరాటాలను నిర్మించారని కొనియాడారు. ప్రజాసేవ కోసం సంతానాన్నే వద్దనుకున్న మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య అని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ సైకిల్ లోనే పార్లమెంటుకు వెళుతూ ఇతర సభ్యులకు భిన్నంగా తన జీవనశలిని గడిపారని తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడున్న రాజకీయ నాయకులలో మచ్చుకైనా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ప్రజానాయకుడు లేరని తెలిపారు. రాజకీయ నాయకులు సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా సుందరయ్య స్థాపించిన సిపిఎం పార్టీ నాయకులకు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రజా కార్మిక రైతు ఉద్యమాలను నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బంగి శివ, మధు తిమ్మరాజు, అంజి నాగరాజు, రమేష్, శ్రీరాములు అంజి, కృష్ణ నాయక్, మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.










