May 19,2023 14:48
  • సుందరయ్య స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు

ప్రజాశక్తి-చిత్తూరు : జన పీడిత నేత పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని శుక్రవారం చిత్తూరు సిపిఎం జిల్లా కార్యాలయంలో ఘనంగా సిపిఎం జిల్లా నాయకులు కే సురేంద్రన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య దేశానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడని కొనియాడారు.  చదువుకుంటున్న సమయంలోనే బాల్యంలోనే దేశం కోసం పేద బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం  పోరాటం చేసిన గొప్ప నాయకుడు అన్నారు. పెద్ద భూస్వామ్య కుటుంబంలో పుట్టినా వ్యవసాయ కార్మికులకు సరైన కూలీ ఇప్పించాలని పోరాటం చేసిన గొప్ప ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ప్రజా సమస్యలను సమగ్రంగా మాట్లాడిన నేత, రాజకీయాలకు అతీతంగా పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శవంతంగా తీసుకుంటారని తెలిపారు. అయితే నేడు ఉన్న దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నదని ఇలాంటి పరిస్థితుల్లో పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శవంతంగా తీసుకొని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో కూడా నాయకుడుగా ఉంటూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అనేక సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన గొప్ప నాయకుడు. నదీ జలాలపై ఆయన చెప్పిన శాస్త్రీయమైన పరిష్కారం ఇప్పటికి కూడా ఆదర్శవంతంగా నిలుస్తున్నది. ప్రస్తుతం వున్న రాజకీయ నాయకులు కులాలు, మతాలు మధ్య చిచ్చు పెడుతూ లబ్ది పొందుతున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య మతాలకతీతంగా కులాలకుతీతంగా సమ సమాజం కోసం చివరి వరకు పోరాడిన గొప్ప నేత తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ముందుండి నడిపిన నాయకుడు. ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో వున్న పాలకులు ప్రజలను దోచుకుంటున్నారని వాటికి విముక్తి కలగాలంటే సుందరయ్య చూపిన బాటను అందరూ నడవాలని ఆయన ఆదర్శవంతంగా తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి గొప్ప నేత ఆశయాలు ముందుకు తీసుకెళ్లినప్పుడే వాళ్లకు నిజమైన నివాళులర్పించినట్లు అవుతుంది అని తెలిపారు.  ముందుగా పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు చైతన్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాలసుబ్రమణ్యం, రాజేష్, జ్యోతి, చిట్టెమ్మ, రాజశేఖర్, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.