ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : పని ప్రదేశంలో చెట్ల నీడ, టెంట్లు లేకుండా పని చేస్తున్నామని ఉపాది కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మోదుగుంట గ్రామంలో ఉపాది పని ప్రదేశాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు సందర్శించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ, గతంలో ఉపాధి పని ప్రదేశాలలో ప్రభుత్వం వారు ఇచ్చిన టెంట్లు వేసుకునే వారమని ఇప్పుడు టెంట్లు ఇవ్వటం లేదని మండుటెండలో పనిచేస్తున్న మజ్జిగ కూడా ఇవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడు వారాల నుండి పని చెప్తున్నారు అని, ఈ పని అయిపోయిన తర్వాత వచ్చేవారం నుండి పని లేదు అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులన్ని చేపల పాటదారుల చేతుల్లో ఉండడం వలన మాకు పని లేకుండా పోతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ మీ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లి పనులు కల్పించేలా మాట్లాడతానని అన్నారు. పనులు కల్పించని పక్షంలో చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దండ్రు వీరమ్మ, కారింకి దుర్గ, మండల కోట సత్యవతి, తీర్థాలు భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.










