ప్రజాశక్తి-హిందూపురం : కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం విరమించుకునే వరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్ వెంకటేష్ అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్ముతామని అహంకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం అమలు చేయలేదు. కార్మిక చట్టాలను నీరుగార్చి లేబర్ కోడ్లుగా మార్చింది. రైతాంగ వ్యతిరేక మూడు నల్లచట్టాలను చరిత్రలో ఎన్నడూ జరగని పోరాటం నడిపి రైతాంగం రద్దు చేయించారు. రైతులకు గిట్టుబాటుధర ఇచ్చే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. కార్మిక వర్గం ఐక్యంగా పోరాడితే బిజెపి అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టగలమన్నారు. ఇప్పటి వరకు ఒక్క శాతం వాటా కూడా విశాఖ స్టీల్ వాటాలు అమ్మడం చేతగాని ప్రభుత్వం ఒకేసారి వందశాతం వాటాలు అమ్మాలని కుట్ర చేసింది. 'పోస్కో'తో జాయింట్ వెంచర్ ప్రక్కనపెట్టి వ్యూహాత్మక అమ్మకాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. 'పోస్కోపై పోరాడుతున్న కార్మికుల గుండె మంటలు బిజెపిని దహిస్తున్నాయన్నారు. అడుగడుగునా దీక్ష, పట్టుదలతో సాగిన సమరశీల పోరాటం ఇది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం అంటే కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొట్టడం. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని సవాల్చేసి ఎదర్కోవడానికి యావత్తు ప్రజానీకం ముందుంది అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేవీ కరణ వ్యతిరేకంగా విశాఖ నగర కేంద్రంగా 2-3-2021 నుండి రిలేనిరాహరదీక్షలు నేటికీ కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్లు కూడా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు అనే ఆయుధంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, అధ్యక్షులు ఈ జగదీష్, కోశాధికారి రామకృష్ణ, మంజునాథ, ఆనందు, చంద్ర, నరసింహామూర్తి, శంకర, తదితరులు పాల్గొన్నారు.










