Apr 10,2023 14:40
  • ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు

ప్రజాశక్తి-కాళ్ల : ఏ గ్రామం వెళ్లినా త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి ప్రధాన సమస్యలపై ప్రజలు నిలదీసే పరిస్థితి నెలకొందని ఉండి ఎమ్మెల్యేమంతెన రామరాజు అన్నారు. కలవపూడి గ్రామంలోని మోడీ ప్రాంతంలో జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టిన పైపులైను విస్తరణ పనులను  ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటిపడిందన్నారు. రానున్న వారంలోపు పైపులైను విస్తరణ పనులు పూర్తి చేసి ప్రజలందరికీ పూర్తిస్థాయిలో త్రాగునీరు అందించే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు మోడీ ప్రాంతంలో సుమారు రూ.17 లక్షలు, కలవపూడి గ్రామంలో సుమారు రూ. 47.50 లక్షలు నిధులతో సుమారు 700 మీటర్లు మేర చేపట్టిన పైప్ లైన్ విస్తరణ నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అధికారులను  ఆదేశించారు. 2018లో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులు ఇప్పటివరకు ప్రారంభించకపోవడం దారుణమన్నారు. శివారు ప్రాంతమైన ఈ గ్రామంలో చుట్టూ నీరున్నా త్రాగటానికి పనికిరాదన్నారు. ఈ ఇబ్బందిని గుర్తించి నాడు సుమారు రెండు కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించిందన్నారు. కానీ సరైన సమయంలో ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ ఫండ్స్ కట్టకపోవడంతో కోటిన్నర పైబడి నిధులు వెనక్కి వెళ్ళిపోయాయన్నారు. చివరికి పనులు ప్రారంభానికి ఇన్నేళ్ల తర్వాత మోక్షం కలగడం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గేదల జాన్, టిడిపి గ్రామ అధ్యక్షుడు నంబూరి త్రినాధ మూర్తి రాజు , బొక్క దుర్గారావు, మంతెన వేణు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ టి.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి షేక్ జమాల్, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.