Jul 31,2023 15:50

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక బాలికల పాఠశాలలో విద్యార్థినిలకు అసౌకర్యాలు వెంటాడుతున్నాయి దీనితో పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళిత మండల కేంద్రమైన నార్పల్లో ప్రభుత్వ బాలబాలికలకు ఒకే పాఠశాల ఉండేది. విద్యార్థుల సంఖ్య ఎక్కువ కావడంతో బోధన ఇబ్బందికరంగా మారిందని 2004వ సంవత్సరంలో ప్రత్యేకంగా బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి అప్పటి ఎలిమెంటరీ పాఠశాలలోని భవనాల్లో తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేశారు. కొద్ది సంవత్సరాల తర్వాత స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని సుల్తాన్ పేటలో బాలికల పాఠశాలకు నూతన భవనాలను నిర్మించి అందులోకి బాలికల పాఠశాలను తరలించారు. అప్పట్లోనే బాలికల పాఠశాల గ్రామానికి దూరంగా ఉందని అనేక ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసిన వాటిని పక్కన పెట్టి అప్పటి విద్యాశాఖ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ చేతుల మీదుగా బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో బాలికల పాఠశాలలో 500 నుండి 600 మంది విద్యార్థులు సుమారు 27 మంది ఉపాధ్యాయినీలు ఉండేవారు విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, ఆటలాడుకోవడానికి సరైన క్రీడా మైదానం లేకపోయినా బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన సావిత్రమ్మ, సన్నక్క, రామచంద్ర, చంద్రశేఖర్, మల్లారెడ్డి పాఠశాల ఉపాధ్యాయునీల కృషితో 2005 నుండి 2023 వరకు పదో తరగతి ఫలితాలలో మంచి ఫలితాలు సాధించి నార్పల మండలంలోనే బాలికల పాఠశాలకు జిల్లా స్థాయిలొనే ప్రత్యేక పేరు వచ్చింది. 2009 నుండి 2015 వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసిన సన్నక్క విద్యార్థుల క్రమశిక్షణ పై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు తరగతి గదులను పర్యవేక్షణ చేస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తూ ఒక ప్రణాళిక బద్దంగా పెట్టారు. ఆమె తరువాత వచ్చిన ప్రధానోపాధ్యాయులు అదే పద్ధతి కొనసాగించారు  ఒకానొక దశలో నార్పల బాలికల పాఠశాల దెబ్బకు పలు ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థినీలు అసలు చేరే వారు కాదని, కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం, ఉరవకొండ తదితర దూర ప్రాంతాల నుండి విద్యార్థినిలు స్థానిక ఎస్సీ, బీసీ హాస్టల్లో చేరి బాలికల పాఠశాలలో చేరేవారు పాఠశాలలో సౌకర్యాలు తక్కువ ఉన్న చదువు బాగుందని ఆడపిల్లలకు పాఠశాల దూరం ఉన్నప్పటికీ సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పటికీ బాలికల పాఠశాలకు విద్యార్థినీయులను వారి తల్లిదండ్రులు అన్ని ఇబ్బందులను అధిగమించి పాఠశాలకు పంపేవారు. 2023౼2024 విద్య సంవత్సరానికి బాలికల పాఠశాలలో విద్యార్థినీల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఒక్కసారిగా పాఠశాలలో విద్యార్థినిల సంఖ్య 957కు చేరడంతో బాలికల పాఠశాలకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగేష్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యార్థినీయులకు సరైన వసతులు, సౌకర్యాలు, కల్పించలేక పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు సిబ్బంది లేకపోవడంతో పాఠశాలలోని విద్యార్థినీలకు పూర్తిస్థాయిలో తరగతులు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం పాఠశాలలో 16 మంది ఉపాద్యాయులు ఉండగా 11 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రస్తుతం ఉన్న విద్యార్థుల నిష్పత్తిని బట్టి ఇప్పుడున్న ఉపాధ్యాయులు కాక పాఠశాలలోని ఖాళీలు కాక మరో 23 మంది ఉపాధ్యాయులు అవసరమవుతుందని స్థానిక మండల విద్య అధికారులు కృష్ణయ్య, నరపరెడ్డిలతో పాటు జిల్లా విద్యాధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్లినట్లు ప్రధానోపాధ్యాయుడు నగేష్ తెలిపారు. దీనికి తోడు పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడ సరైన సౌకర్యం లేక ఇబ్బందికరంగా ఉందని అదేవిధంగా విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా మరుగుదొడ్లు కూడా పూర్తిస్థాయిలో లేవని దీనితో గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలకు వస్తున్న విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పాఠశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి ఇప్పటికైనా జిల్లా విద్యాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి బాలికల పాఠశాలలో నెలకొన్న అసౌకర్యాలను తొలగించడంతోపాటు పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేసి నార్పల మండలంలో చదువుల సరస్వతులకు నిలయంగా మారిన బాలికల పాఠశాల పేరును అలాగే నిలపడానికి కృషి చేయాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు.