ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోతే ఆత్మహత్య శరణ్యమని విడపనకల్లు మండల పరిధిలోని చీకలగురికి గ్రామం రైతులు పేర్కొన్నారు. బుధవారం చీకలాగురికి గ్రామ రైతులు వారి పొలాలలో పడిపోయిన విద్యుత్ స్తంభాలు చూపిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత పది రోజుల క్రితం వచ్చిన ఈదురు గాలులకు గ్రామ సమీపంలో గుర్రం వెంకన్న లైన్‌లో 6, డోన్ చెరువు దగ్గర 3, రామాంజనేయులు విద్యుత్ లైన్ దగ్గర 4 విద్యుత్ స్తంభాలు మొత్తం 11 విద్యుత్ స్తంభాలు తెగిపడిపోయాయన్నారు. గత పది రోజుల నుంచి విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో గ్రామంలో దాదాపు 700 ఎకరాల మేరకు బోరు బావుల కింద సాగు చేసిన వేరుశెనగ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వేరుశెనగ విత్తనాలు సాగు చేసి దాదాపు 40 రోజులు అయిందని ఎకరాకు 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వేలాది రూపాయలు అప్పులు సాగుచేసిన పంటలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ శాఖకు సంబంధించిన లైన్మెన్‌తో పాటు మండల ఏఈని సంప్రదించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారని వాపోయారు. వీలైనంత తొందరలో సమస్యను పరిష్కరించకపోతే విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడి చేపడుతామని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టి సచివాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామం రైతులు కే విజయభాస్కర్ వన్నూరు స్వామి, మల్లన్న, ఎర్రి స్వామి, లింగన్న, సిద్ధప్ప, జయరాములు, చెన్నయ్య, ముత్తుముని, రమేష్, రామాంజనేయులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.










