ప్రజాశక్తి-చిత్తూరు : దేశ, రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణలో (01.09.2021 నుండి 31.08.2022 వరకు) ప్రాణ త్యాగాలు చేసిన 287 మంది పోలీసులకు ఘన నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన భాద్యత అని, వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి ఇ.భీమరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, ఐపిఎస్ గారులు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా గురువారం చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వు పేరడ్ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి ఇ.భీమ రావు , జాయింట్ కలెక్టర్ శ్రీ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, ఐపిఎస్ లు స్మృతి పరేడ్ కు హజరై, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
జిల్లా జడ్జి ఇ.భీమరావు మాట్లాడుతూ.... పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. ప్రజాశ్రేయస్సు, శాంతి భద్రతలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులు తమ ప్రాణాలను లోడ్డి విధులు నిర్వహిస్తున్నారని, పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరం అన్నారు. జిల్లాలోని పోలీసులు అండగా ఉంటూ అనేక రకాలుగా వారిని ఆదుకుంటామన్నారు. పోలీసులు పడుతున్న కష్టాన్ని శ్రమను గుర్తిస్తే వారికి అదే సంతోషం ఇస్తుందన్నారు. విద్యార్థులు, సమాజంలో ఉన్న ప్రజలు క్రమశిక్షణతో మెలిగేందుకు అవగాహన సదస్సులు కల్పించాలని జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీలను కోరుతున్నామన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యతన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం అన్నారు. శాంతి భద్రతల కట్టడిలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తున్న పోలీసులను సమాజం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ... 1959 అక్టోబర్ 21న జరిగిన దురదృష్ట సంఘటనను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను సంస్మరణం చేసుకోవడం కోసం ప్రతి ఏటా ఈ రోజున పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ వై.రిశాంత్ రెడ్డి, ఐపిఎస్ గారు మాట్లాడుతూ.... దేశం కోసం ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామన్నారు. సమాజం కోసం, భవిష్యత్తు తరాల కోసం, ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. అమరులైన అందరి కోసం శ్రధ్దాంజలి ఘటిస్తూ, నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులైన పోలీసు కుటుంబాల వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పి.జగదీశ్, IPS, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ డాక్టర్ కె.వి.శ్రీనివాస రావు, చిత్తూరు SDPO ఎన్.సుధాకర్ రెడ్డి, SB డిఎస్పి వి.శ్రీనివాసులు రెడ్డి, మహిళా డిఎస్పి శ్రీ బాబు ప్రసాద్, ఏఆర్ డిఎస్పి లక్ష్మి నారాయణ రెడ్డి, CCS డిఎస్పి శ్రీనివాసులు, ట్రాఫిక్ డిఎస్పి జే.తిప్పేస్వామి, RI లు శ్రీ నీలకంటేశ్వర రెడ్డి, మధు పట్టణంలోని అందరు సిఐ లు, ఎస్సై లు, పోలీస్ ఆఫీస్ ఏ.ఓ. మోహన్ రావు, ఏ.ఏ.ఓ. దస్తగిరి, పోలీస్ ఆఫీస్ సిబ్బంది, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు ఉదయ్ మరియు పోలీసు కుటుంబాలు పాల్గొన్నారు.










