Sep 26,2023 21:59

ఫుట్‌పాత్‌ వ్యాపారులకు గేటు ఉచితం: ఎంపి
ప్రజాశక్తి- కుప్పం:
కుప్పం పట్టణ పరిధిలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌ వ్యాపారాలు పురపాలక సంఘానికి గేటు రూపంలో చెల్లించే పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్టు చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్ప తెలిపారు. మంగళవారం కుప్పం పట్టణంలోని చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఎంపి పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ గతంలో అన్నమయ్య జిల్లా ఎంపి పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి కుప్పంలో పర్యటించిన సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వివరించడం జరిగిందన్నారు. అందులో ఫుట్‌పాత్‌ వ్యాపారులు తాము గేటు రూపంలో పురపాలక సంఘానికి చెల్లించే రుసుం విషయమై తమకు సాయం చేయాల్సిందిగా కోరినట్టు తెలిపారు. ఈ విషయమై స్పందించిన అన్నమయ్య జిల్లా ఎంపీ ప్రతి నెల ఫుట్‌పాత్‌ వ్యాపారులు పురపాలక సంఘానికి చెల్లించాల్సిన రుసుంను తన సొంత నిధుల నుండి చెల్లించడానికి అంగీకరించినట్టు తెలిపారు. ఈఅవకాశాన్ని ఫుట్‌పాత్‌ వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందుకోసం పట్టణ పరిధిలోని ఫుట్‌పాత్‌ వ్యాపారులు పురపాలక సంఘం కార్యాలయంలో కానీ, చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ కార్యాలయంలో కానీ తమ వ్యాపారాన్ని నమోదు చేసుకుని ఐడీ కార్డు పొందాలని సూచించారు. అలాగే కుప్పం పురపాలక సంఘం అభివద్ధిలో భాగంగా పట్టణ పరిధిలో పురపాలక సంఘం కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.50 లక్షలు, మూడవ సచివాలయ భవన నిర్మాణానికి రూ.25లక్షలు, వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ప్రహరీ నిర్మాణానికి మరో రూ.15లక్షలు నిధులను ఎంపీ నిధుల నుండి విడుదల చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కుప్పం పురపాలక సంఘం అధ్యక్షులు డాక్టర్‌ సుధీర్‌, వైసిపి నాయకులు మోహన్‌ రామ్‌, గణపతి తదితరులు పాల్గొన్నారు.
కుప్పం అభివద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా..?
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ సవాల్‌..

కుప్పం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మంగళవారం చిత్తూరు జిల్లా ఎంపీ పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించి ఫుట్‌పాత్‌ వ్యాపారులు పురపాలక సంఘానికి చెల్లించాల్సిన గేటును తమ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెల్లిస్తారని ప్రకటించడం ప్రజల ఓట్లు కొల్లగొట్టడానికే అన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈ ప్రకటన చేశారని, వారికి చిత్తశుద్ధి ఉంటే వారు అధికారం చేపట్టినప్పటి నుండి పురపాలక సంఘం గేటు ఎత్తివేసి ఉండవచ్చని అన్నారు. గొప్పులు చెప్పుకుంటున్న వైసిపి నాయకులు కుప్పం అభివృద్ధిపై శ్వేతప్రతం విడుదల చేయాలని సవాల్‌ విసిరారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, ఎన్నికలలో కచ్చితంగా అధికార పార్టీకి బుద్ధి చెప్పి తీరుతారని అన్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు సోమశేఖర్‌, జాకిర్‌ టిడిపి నాయకులు సత్యేంద్ర శేఖర్‌,బాబు, చంద్రశేఖర్‌, కన్నన్‌, అహ్మద్‌, జెకె సంతోష్‌ పాల్గొన్నారు.