
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: మత్స్యకారులకు ఉపాధి చూపేందుకే ఫిష్ ఆంధ్రా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని పొన్నాడ వంతెన వద్ద ఫిష్ ఆంధ్రా స్టాల్‌ను మంగళవారం ప్రారంభించారు. ఒక్కో అవుట్‌లెట్‌కు రూ.3.50 లక్షల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద 19 అవుట్‌లెట్లను ప్రారంభించామన్నారు. మంచి చేపలను పౌరులకు అందించాలనే సంకల్పంతో ఫిష్ ఆంధ్రాకు రూపకల్పన చేశామన్నారు. చేప పిల్లల రవాణాకు రూ.13.39 లక్షలతో వాహనం కొనుగోలు చేసేందుకు సాయం అందించినట్లు తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.పది లక్షలు చొప్పున సాయం అందిస్తున్నట్లు చెప్పారు. మంచినీళ్లపేట వద్ద ఫిష్ లాండింగ్ సెంటర్, బుడగుట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనులు పూర్తయితే జిల్లాలోని మత్స్యకారులు గుజరాత్‌కు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. మూలపేట పోర్టు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఈ పోర్టు పూర్తయితే ప్రపంచంతో జిల్లాకు అనుసంధానం అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు తీరని అన్యాయం చేసిందన్నారు. కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మామిడి శ్రీకాంత్, వైసిపి రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, జెడ్‌పిటిసి రుప్ప దివ్య, మత్స్యశాఖ జెడి శ్రీనివాసరావు, ఎఫ్‌డిఒ గంగాధర్, పొన్నాడ రిషి, శ్రీనివాస్ పట్నాయక్, గంగు నరేంద్ర, సురాడ సూర్యం, గురుమూర్తి, గనగల్ల రాము తదితరులు పాల్గొన్నారు.