
* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి- శ్రీకాకుళం: స్పందన ఫిర్యాదులపై శాశ్వత పరిష్కారం చూపాలని, పునరావృతం కాకూడదని పోలీసు అధికారులను ఎస్‌పి జి.ఆర్ రాధిక ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్‌పి టి.పి.విఠలేశ్వరరావుతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇందులో భాగంగా 45 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కుటుంబ తగాదాలకు 5, పౌర సంబంధమైనవి 16, మోసాపురితమైనవి 3, సైబర్ నేరం ఒకటి, పాతవి 7, ఇతర పిర్యాదులు 13 వచ్చాయి. ఫిర్యాదుదారుల సమస్యలను పరిశీలించి సంబంధిత పోలీస్‌స్టేషన్ల పరిధిలోని అధికారులకు తక్షణమే ఫోన్ కాల్ ద్వార సమాచారం అందించారు. ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకార విచారణ చేపట్టి నిర్ధేశించిన గడువులోగా త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదుదారులకు భరోసానిచ్చారు.