
* జాయింట్ కలెక్టర్ నవీన్
ప్రజాశక్తి - కొత్తూరు: అర్జీదారులు అందజేసే ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్‌తో కలిసి బుధవారం నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత అధికారులకు సమస్యలు వివరిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించాలని మెట్టూరు బిట్-3 నిర్వాసితులతో కలిసి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గంగరాపు సింహాచలం, సిర్ల ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రహదారిలో మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. వెలుగు సంస్థలో పనిచేస్తున్న విఒఎలకు ఉద్యోగభద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. బమ్మిడిలో ఉన్న ఇనాం భూములను రైతుల పేరున మార్చాలని సర్పంచ్ ప్రతినిధి వి.సూర్యనారాయణ కోరారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎంపిడిఒ ఆహ్వానించలేదని పిఎసిఎస్ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. సిరుసువాడ నుంచి ఎబి రహదారి అధ్వానంగా ఉందని మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, తహశీల్దార్ ఎం.చక్రవర్తి, ఎంపిడిఒ పావని, పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.