అనంతపురం కలెక్టరేట్ : విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యింది. వేసవి సెలవులు ముగియడంతో పిల్లలు పాఠశాలల బాట పట్టారు. కొత్త సంవత్సరంలో వారికి కావాల్సిన పుస్తకాలు, యూనిఫాం తదితర విద్యా సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడే తల్లిదండ్రులకు అసలు కష్టాలు మొదలయ్యాయి. ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. పాఠశాలలు ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే పుస్తకాల కొనుగోలు, ఫీజులపై ఆయా పాఠశాలల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు గత వారం రోజులుగా విద్యా సామగ్రి అమ్మకాలు ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. ప్రయివేటు యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. వేలాది రూపాయలు కట్టాల్సి రావడంతో పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల జూన్ నెల బడ్జెట్ తడిసిమోపడవుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణాల్లోనూ ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. టెక్నో, ఈసిలబస్, ఐపిఎల్ తదితర పేర్లతో క్యాంపస్‌లను నిర్వహిస్తున్నారు. తమ పాఠశాలలో అత్యుత్తమ విద్యా బోధన అందిస్తున్నామని చెప్పి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. నర్సరీ, ఎల్‌కెజి, యుకెజీకే రూ.30 నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫాం తదితరం దీనికి అదనం. తమ పిల్లలు బాగా చదువుకోవాలన్న ఆశతో తల్లిదండ్రులు ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడే వారిని కార్పొరేట్ యాజమాన్యం దోపిడీ చేస్తోంది. పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, యూనిఫాం తదితర అన్ని రకాల విద్యా సామగ్రి తమ వద్దే కొనాలంటూ ప్రయివేటు యాజమాన్యాలు హుకూం జారీ చేస్తున్నాయి. యూనిఫాం బయట రూ.800 ధర ఉంటే అదే కార్పొరేట్ పాఠశాలలో రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నాయి. వీటి నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. పుస్తకాలు కూడా వారి చెప్పిందే ధరగా ఉంటోంది. అనంతపురంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో 4వ తరగతి చదవే విద్యార్థుల పాఠ్య పుస్తకాలు రూ.7 వేలు, 5వ తరగతి చదివే విద్యార్థి పుస్తకాలు రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. అందులో ఉన్న పుస్తకాలను పరిశీలిస్తే అన్నీ కూడా నోటు పుస్తకాలు ఉంటున్నాయి. బయట మార్కెట్లో ఈ నోటు పుస్తకాలు సగం ధరకే లభిస్తాయి. పెన్సిల్ దగ్గర నుంచి టెక్ట్స్‌బుక్ వరకు అన్నీ మా వద్దే కొనాలంటూ కార్పొరేట్, ప్రయివేటు యాజమాన్యం ఒత్తిడి చేయడంతో తల్లిదండ్రులు చేసేది లేక అధిక ధరలని తెలిసినా వాటిని కొనుగోలు చేయక తప్పడం లేదు. ప్రస్తుతం ఏ ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలను పరిశీలించిన అక్కడ పుస్తకాల వ్యాపార కేంద్రాలు కన్పిస్తాయి. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు తెలివిగా పుస్తక విక్రయశాలను పాఠశాలకు సమీపంలోని ఓ ప్రయివేటు గదిలో ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నాయి. పాఠశాలలో పుస్తకాలకు సంబంధించిన ఫీజును చెల్లించి, ఈ రసీదును పుస్తకాలు వియ్రిస్తున్న చోటుకు తీసుకెళ్తే అక్కడ వాటిని అందించేలా ఏర్పాటు చేసుకున్నారు.
ఎడాపెడా ఫీజుల పెంపు
ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులకు అడ్డూఅదుపు లేదనే చెప్పాలి. ఎల్‌కెజి స్థాయికే రూ.30 వేలు(హాస్టల్ లేకుండా) వసూలు చేస్తున్నారు. హాస్టల్‌తో కలిపి అయితే ఈ ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి. పాఠశాలల్లో పిలల్ని చేర్పించేందుకు ఉపయోగించే అడ్మిషన్ ఫామ్‌కు సైతం రూ.500 వరకు వసూలు చేస్తున్నారంటే ప్రయివేటు దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, స్పెషల్ ఫీజు, కల్చరల్ ఫీజు ఇలా అనే పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణలో అధికారుల నియంత్రణ లేకపోవడంతో ప్రయివేటు దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రయివేటు పాఠశాలలకు సంబంధించి యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజుల విషయంలో ఈ కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి కమిటీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ కార్పొరేట్ పాఠశాలలోనూ లేనట్లు తెలుస్తోంది. ఫీజుల నియంత్రణ విషయంలో అధికారులు నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పెరిగిన జూన్ బడ్జెట్
విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. జూన్ నెల అనగానే ఫీజుల భారాల గుర్తుకొచ్చి వారికి టెన్షన్ మొదలవుతుంది. ప్రస్తుతం తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉంది. ఏడాదికేడాది ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు పెంచేసి తల్లిదండ్రులపై భారాలను మోపేస్తున్నాయి. పదో తరగతి విద్యార్థుల వరకు ప్రతి ఏడాది ఏదో రూపంలో కార్పొరేట్ పాఠశాలలు రూ.2వేలకు తక్కువ కాకుండా అదనంగా తల్లిదండ్రుల నుంచి ఫీజులను కట్టించుకుంటున్నాయి. ఇదేమని తల్లిదండ్రులు అడిగితే సంబంధం లేని సమాధానం చెబుతున్నారు. పిల్లల్ని చదివించాలన్న తాపత్రయంతో చేసేదేమీ లేక వేలాది రూపాయలను ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యను వ్యాపారంగా మార్చేశారు..!
ఓతూరు పరమేష్,
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి.
విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునుపే 2023-24కు సంబంధించి కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహించాయి. విద్యార్థుల తల్లితండ్రుల నుంచి లక్షలాది రూపాయలను ఫీజులు రూపంలో వసూలు చేస్తున్నాయి. పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం తదిర పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.5500 నుంచి రూ.18,500 వరకు వసూలు చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పుస్తకాలు పాఠశాలలో విక్రయించరాదని ఉన్నప్పటికీ ఈ చట్టాన్ని భేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం పేరుతో ప్రతి పాఠశాలలో నిర్ధేశిత ఫీజులు నిర్ణయించినప్పటికీ ఆ నిబంధనలను తుంగలోకి తొక్కి విద్యా వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా విద్యా శాఖ అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం, ఆర్‌ఐఒ సురేష్‌బాబులు ప్రయివేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టే చర్యలను వెంటనే తీసుకోవాలి. కలెక్టర్ గౌతమి స్పందించి జిల్లా విద్యా పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని నియంత్రించాలి.










