ఫీజుల భారం..!
అధిక వసూళ్లు
కార్పొరేటు, ప్రయివేటు యాజమాన్యల ఇష్టారాజ్యం
ప్రభుత్వ ధరలు అమలు అనుమానమే..
పట్టని అధికారులు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
పాఠశాలలు మరో రెండు రోజుల్లో తెరుచుకోనున్న నేపథ్యంలో కార్పొరేటు, ప్రయివేటు పాఠశాలలు యాజమాన్యాలు ఫీజుల భారానికి తెరలేపాయి. ఇది వరకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేసేందుకు అవి ముందుకు రావడం లేదు. తాము పెట్టిందే ధర.. దాన్నే కట్టాలి అనే తీరులో వ్యవహరిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కొత్త ఫీజులను వసూలు చేసేందుకు తెరలేపాయి. తల్లిదండ్రుల వద్ద అందినకాడికి దోచుకుంటున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.
జిల్లా వ్యాప్తంగా 600వరకు ప్రయివేటు, కార్పొరేటు పాఠశాలలున్నాయి. వీటిల్లో 1.50లక్షల మంది దాకా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది వరకు ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. అయితే ఇక్కడ నెలకున్న సమస్యల కారణంగా ఆయా పాఠశాలల్లోని వారు తిరిగీ ప్రయివేటు పాఠశాలల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే అదనుగా ఆయా యాజమాన్యాలు అందిన కాడికి దోచుకుంటున్నాయి. ఒకేసారి 20 నుంచి 40 శాతం వరకు ఫీజులు పెంచేస్తున్నాయి. ఈ ధరలు చూసి తల్లిదండ్రుల గుండెలు జల్లుమంటున్నాయి.
ఎల్‌కెజి, యుకేజీలకు ఏకంగా రూ.30ల నుంచి రూ.40వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక ఫౌండేషన్ పేరుతో లక్షల్లో ఫీజుల భారం మోపుతున్నారు. సెంట్రల్ సిలబస్ అని, ఐఐటి అని పేర్లు చెప్పి తల్లిదండ్రుల వద్ద అందిన కాడికి దోచుకుంటున్నాయి. ఇది వరకు ప్రభుత్వం మూడు కేటగిరిలుగా విభజించి ఆ మేరకు ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. పంచాయతీలు, మండల కేంద్రాలు, ఒక విధంగా, మున్సిపాలిటీల్లో మరో విధంగా, ఇక కార్పొరేషన్లలో ఒక విధంగా ఫీజులను నిర్ణయించింది. వీటిని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెట్టింపుగా వసూలు చేస్తున్నారు. ఐదో తరగతి వరకు ప్రయివేటు పాఠశాలలు సంవత్సరానికి రూ.30వేలు వసూలు చేస్తుంటే పదోతరగతి వరకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక ఇంటర్‌లో లక్షల్లో వసూలు చేస్తున్నారు.
ప్రయివేటు యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. కానీ కనీస సౌకర్యాలు మాత్రం ఏర్పాటు చేయడం లేదు. ఎక్కువ పాఠశాలలకు క్రీడా మైదానాలు కూడా లేకుండా లేవు. తగిన విద్యుత్ సౌకర్యాలు ఉండాలి. ఫైర్ సేఫ్టీ ఉండాలి. అయితే విద్యాశాఖ అధికారులు డబ్బులు తీసుకుని ఈవేవీ చూడకుండానే కాలేజీలు మార్చేస్తున్నారు.
అధిక వసూళ్లపై చర్యలు తీసుకోవాలి
పాఠశాలలు తిరిగీ ప్రారంభమవుతున్న సమయంలో ప్రయివేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అధిక వసూళ్లకు తెగబడుతున్నాయి. ఇలాంటి వాటిపై అధికారులు దాడులు చేసి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ధరల పట్టికలను ఆయా పాఠశాలల ముందు ప్రదర్శించాలి.
- వాడ గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి










