Oct 05,2023 21:36

పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
నూతన కలెక్టరేట్‌ (ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌)లో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పాలనా వ్యవహారాలు చేపట్టనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. ఆర్‌అండ్‌బి ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి గురువారం కొత్త కలెక్టరేట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంప్లెక్స్‌ నిర్మాణం తుది దశలో ఉందని, సివిల్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా పర్యటించారని, జిల్లా మంత్రుల చొరవతో సుమారు రూ.7.5 కోట్ల పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని చెప్పారు. ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ పర్యవేక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్టు సంస్థ ఈ డిసెంబరు నాటికి కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌కు తుదిరూపు తెస్తామని హామీనిచ్చిందన్నారు. డిసెంబరు నాటికి గ్రౌండ్‌ఫ్లోర్‌, ఫిబ్రవరి నాటికి మొత్తం భవనం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఏడెనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన పాత కలెక్టరేట్‌ స్థానే జిల్లాల పునర్విభజన తర్వాత అవతరించిన శ్రీకాకుళం జిల్లాలో అన్ని శాఖలు ఒకే చోటకు వచ్చినట్లవుతుందన్నారు.
ప్రతి వారం సమీక్షిస్తా
అంతకుముందు కలెక్టర్‌ నూతన కలెక్టరేట్‌లోని పలు బ్లాకులను సందర్శించారు. ఇకపై ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. పనులు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో వేగంగా చేయాలని కాంట్రాక్టు సంస్థకు చెప్పారు. సెంట్రలైజ్డ్‌ ఎసి, మరుగుదొడ్ల నిర్వహణ, పార్కింగ్‌ సౌకర్యాల గురించి పలు సూచనలు చేశారు. ఆయా డిపార్ట్‌మెంట్లకు వేర్వేరు కరెంట్‌ మీటర్లను అమర్చాలని సూచించారు. నాగావళి నదికి కలెక్టరేట్‌కు మధ్యలో కాంక్రీటు ఫ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలన్నారు. పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రధాన పోర్టికోకు రహదారి అనుసంధానం పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్‌ ముందు భాగంలో ల్యాండ్‌ స్కేపింగ్‌ చేసి, వంద మీటర్ల ఎత్తయిన పోల్‌ ఏర్పాటు చేసి, జాతీయ జెండా ఎగిరేలా తీర్చిదిద్దాలని సూచించారు. కలెక్టరేట్‌ లోపలి గోడలపై జిల్లా గొప్పదనాన్ని తెలిపేలా పెయింటింగ్స్‌ వేయించాలన్నారు. కచ్చితమైన నెట్‌వర్క్‌ వ్యవస్థతో 200 మందికి సరిపడేలా పెద్ద సమావేశ మందిర నిర్మాణం రానున్న రెండు నెలల్లోపే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రహదారులు, భవనాల శాఖ ఎస్‌ఇ జాన్‌ సుధాకర్‌, ఇఇ రవినాయక్‌, డిఇ సాగర్‌, ఎఇ పి.టి రాజు, సైట్‌ ఇన్‌ఛార్జి ప్రసాద్‌ చౌదరి తదితరులున్నారు.