Oct 18,2023 20:49

వినతిపత్రం అందజేస్తున్న అంగన్వాడీ యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: ఐసిడిఎస్‌ లబ్ధిదారులకు ఫేస్‌ యాప్‌ను రద్దు చేయాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు కోరారు. నగరంలోని ఐసిడిఎస్‌ కార్యాలయంలో పీడీ బి.శాంతిశ్రీకి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, ఉపాధ్యక్షులు పి.లతాదేవి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలకు సరుకులు, పాలు, గుడ్లు ఇచ్చే సందర్భంలో ఫేస్‌ యాప్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అనారోగ్య సమస్యలు, బెడ్‌ రెస్ట్‌ ఉన్న వాళ్లకూ ఫేస్‌ యాప్‌ అమలు చెయాలని బలవంతం చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల అంగన్వాడీలు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో సంతకం పెట్టి, ప్రభుత్వం ఇచ్చే సరుకులు తీసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రతినెలా గ్యాస్‌ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. రకరకాల ఈవెంట్లకు అంగన్వాడీ కార్యకర్తలు సొంత డబ్బులతో ఆహర పదార్థాలు తయారు చేసి తేవాలని చెప్పడం సరికాదన్నారు. అంగన్వాడీలను ఇతర సమావేశాలకు వినియోగించడాన్ని ఆపాలని కోరారు. కేంద్రాల నిర్వహణకు తీసుకున్న భవనాలకు అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. రకరకాల యాప్‌లు తెచ్చి అంగన్వాడీలపై పనిభారం పెంచారని, యాప్‌ల భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని, మినీ వర్కర్లకు మెయిన్‌ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. పెరిగిన ధరలకనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, పెండింగ్‌ టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని, ఆయిల్‌, కందిపప్పు పరిమాణాన్ని పెంచాలన్నారు.