Jul 07,2023 09:31

ఫార్మసీ బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ సమావేశంలో పాల్గొన్న విసి రంగజనార్ధన

         అనంతపురం : ఫార్మసీ బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ 5వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు జెఎన్‌టియు విసి రంగజనార్ధన తెలిపారు. గురువారం నాడు వర్సిటీ పరిపాలన భవనంలో విసి అధ్యక్షతన ఫార్మసీ బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ 5వ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మసీ సిలబస్‌ రివిజన్‌తో పాటు 23 రెగ్యులేషన్‌ ప్రకారం హానర్స్‌, రీసెర్చ్‌ డిగ్రీలు రెగ్యులర్‌ డిగ్రీను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ఫార్మసీ సిలబస్‌ రివిజన్‌ కోసం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌-23 రెగ్యులేషన్స్‌పై చర్చించామన్నారు. రెగ్యులేషన్స్‌లో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రెగ్యులేషన్స్‌ను అనుసరిస్తున్నామని చెప్పారు. వీటిలో కొంతమేరకు మార్పులుంటాయని తెలిపారు. ఈ రెగ్యులేషన్స్‌లో హానర్స్‌ లేక రీసెర్చ్‌ డిగ్రీలను, రెగ్యులర్‌ డిగ్రీతో పాటు ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. ఈ డిగ్రీలను పొందాలంటే అదనంగా 12 క్రెడిట్‌లను సాధించాలని తెలిపారు. ఈ సిలబస్‌లో నాలుగు ప్రొఫిషనల్‌ ఎలక్టివ్స్‌, రెండు ఓపెన్‌ ఎలాక్టివ్స్‌, స్కిల్‌ ఓరియంటెడ్‌ కోర్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ పాలసీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు సమ్మర్‌ ఇంటర్నషిప్‌లను రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం చివర్లో చేయాలన్నారు. వీటికి ఎనిమిది వారాల వ్యవధిని ఇస్తామని తెలిపారు. వీటితో పాటు ఆడిట్‌ కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. హానర్స్‌, రీసెర్చ్‌ డిగ్రీ రిజిష్టర్‌ చేసుకోవడానికి రెగ్యులర్‌ డిగ్రీలో మూడవ సెమిస్టర్‌ వరకు 7 జీపీఏ సాధించిన విద్యార్థులు అర్హత సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకడమిక్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ వి.సుమలత, రెక్టార్‌ ఎం.విజయ కుమార్‌, పరీక్షలు విభాగం డైరెక్టర్‌ ఇ.కేశవరెడ్డి, బోర్డ్‌ అఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌ ఎన్‌.దేవన్న, సభ్యులు ఆశిత్‌ కుమార్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.