ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ కార్మిక చట్టాలు అమలు చేయని ఫార్మా కంపెనీల యాజమాన్యాన్ని శిక్షించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రెప్రజెంటేటీవ్స్ యూనియన్, సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, మెడికల్ సేల్స్ రెప్రజెంటేటీవ్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.మనోహర్ మాట్లాడుతూ కార్మిక శాఖలో పెండింగ్‌లో ఉన్న కేసులన్ని పరిష్కరించాలని కోరారు. మెడికల్ సేల్స్ రెప్రజెంటేటీవ్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.విశ్వనాథ్ మాట్లాడుతూ మహిళా కార్మికులకు 6 నెలల ప్రసూ తి సెలవులు ఇవ్వాలన్నారు. సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతన బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. మెడికల్ సేల్స్ రెప్రజెంటేటీవ్స్ యూనియన్ జిల్లా శాఖ కార్యదర్శి మంజునాథ్ మాట్లాడుతూ నిగోసిబుల్ ఆక్ట్ ప్రకారం మేడేని హాలిడేగా ప్రకటించాలని కోరారు. అనంతరం కార్మిక శాఖ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సేల్స్ రెప్రజెంటేటీవ్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జె.సురేంద్ర, ఉపాధ్యక్షులు ప్రసన్నకుమార్, రామసుబ్బారెడ్డి, సహాయ కార్యదర్శి ఇషాక్, రామాంజినేయులు, కోశాధికారి జి.అమర్‌నాథ్, జనరల్ కౌన్సిల్ మెంబర్ పి.చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు సురేంద్రగుప్త తదితరులు పాల్గొన్నారు.
కార్మిక శాఖ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న సిఐటియు నాయకులు, మెడికల్ రెప్‌లు










