- పింఛన్ తొలగింపుపై మాజీ మంత్రికి మొర పెట్టుకున్న బాధితులు
ప్రజాశక్తి-పలమనేరు : బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న తమ బిడ్డ పింఛన్ నిష్కరణంగా తొలగించారని బాధితులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి బుధవారం మొర పెట్టుకున్నారు. పలమనేర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు ఈ సందర్భంగా వారి గోడు వెళ్ళబోసుకున్నారు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని 24వ వార్డుకు చెందిన శీనా, శోభాలకు చెందిన తమ కుమారుడు నవీన్(18) బుద్దిమాంద్యంతో బాధపడుతూ ఉండడంతో ఇప్పటిదాకా పింఛన్ అందుతూ ఉండేది అన్నారు. అయితే తమకు ఇల్లు సాకును చూపుతూ ఆ పించన్ను తొలగించునున్నట్లు నోటీసులు అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి పెద్ద దిక్కైన శీనా సైతం గుండెజబ్బుతో బాధపడుతున్నాడని దీంతో శోభా కష్టపడితే గానీ కడుపు నింపుకునే పరిస్థితి లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నవీన్ కు వస్తున్న పింఛన్ సొమ్ము కుటుంబానికి కాస్త ఆసరాగా ఉండేదని ఇప్పుడు దాన్ని తొలగించేశారని కంటతడి పెట్టారు. దీనిపై అధికారులకు విన్నవించిన పరిశీలిస్తామని చెప్పి రోజులు గడుస్తున్నా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి ఇలాంటి నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ తొలగించడం చాలా బాధాకరమని అధికారులు స్పందించి వెంటనే బాధితులకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










