- ఎమ్మెల్యే వెంకటే గౌడ, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు
ప్రజాశక్తి-వి కోట : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. మండల కేంద్రమైన వీకోటలోని వ్యవసాయ కార్యాలయ ప్రాంగణంలో గురువారం ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వేరుశనగ విత్తనకాయలు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అవసరం కోసం మండలానికి 2025 క్వింటాళ్లు వేరుశనగ విత్తనకాయలు అందుబాటులో ఉంచామన్నారు. ఇంతవరకు 1765 క్వింటాళ్ల విత్తనాన్ని 18 రైతు భరోసా కేంద్రాలలో పంపిణీకి సిద్ధంగా ఉంచడమైనదన్నారు. వేరుశనగ విత్తన కాయలు ఒక బస్తా పూర్తి ధర 2790 రూపాయలు కాగా రాయితీ 1116 రూపాయలు పోను రైతు చెల్లించవలసినది 1674 రూపాయలన్నారు. వేరుశెనగ విత్తనములు కావలసిన రైతులు సంబంధిత రైతు భరోసా కేంద్రాలలో బయోమెట్రిక్ ఆధారిత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విత్తనాలు పంపిణీ చేయబడుతుందన్నారు. కావలసిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, మొబైల్ ఫోను తీసుకుని రైతు భరోసా కేంద్రంలో సంప్రదించాలన్నారు. మండలంలోని రైతులందరికీ విత్తనాలను నిష్పక్షపాతంగా పంపిణీ చేయాలని అవసరమైన మేరకు ముందస్తు సమాచారం ఇస్తే మండలంలో విత్తనాల కొరత రానికుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. ఈనెల26 వ తేదీ బైరుపల్లి, కొంగాటం, కృష్ణాపురం కుంబార్లపల్లి, మద్దిమాకులపల్లి, ముదరం దొడ్డి, పాము గాని పల్లి పెద్ద భరణి పల్లి, తోటకనుమ, వీకోట, ఓగు రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రైతులకు ఇతర కాయలు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. పంపిణీ చేయబడును అదేవిధంగా 27వ తేదీ బోయ చిన్నాగనపల్లి, చింతమాకులపల్లి గోనుమాకులపల్లి, జవునిపల్లి రైతు భరోసా కేంద్రాలలో విత్తన కాయలు పంపిణీ చేస్తామన్నారు. 29వ తేదీ శివుని కుప్పం, సుద్దుల కుప్పం రైతు భరోసా కేంద్రాలలో ఈ పంపిణీ చేయబడుతుందన్నరు. బోడిగుట్ట పల్లి,యాలకల్లు, నెర్నిపల్లి, పట్రపల్లి రైతు భరోసా కేంద్రాలలో వేరుశనగ విత్తనాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వీటితోపాటు రైతులు పొలాల్లో భూసారన్ని పెంపొందించేందుకు పచ్చి రొట్టె ఆకు విత్తనాలు, జనుము 10 కేజీలు రాయితీ పోను 420 రూపాయలు మరియు జీలుగా 10 కేజీలు రాయితీ ఫోను 395 రూపాయలు రైతులు చెల్లించి రైతు భరోసా కేంద్రాలలో పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమలో ఎంపీపీ యువరాజ్, వీకోట సర్పంచ్ పి ఎన్ లక్ష్మి, వైస్ సర్పంచ్ అక్మల్, రాష్ట్ర రోడ్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలగురునాథ్ , పిఎసిఎస్ చైర్మన్ లు శ్రీరాములు రెడ్డి, గోపిరెడ్డి, రాష్ట్ర వైకాపా ప్రధాన కార్యదర్శి పి.న్.నాగరాజు రైతు భరోసా సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు










