Jul 06,2022 00:08

దీక్షలు ప్రారంభించిన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరు కుమార్‌

ప్రజాశక్తి- చిత్తూరుప్రతినిధి
నగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది పవర్లూమ్‌ కార్మికులకు కూలి రేట్లు పెంచాలని, వారు చేస్తున్న సమ్మె సందర్భంగా మంగళవారం నగిరి రైల్వేగేట్‌ వద్ద భారీస్థాయిలో రిలే దీక్షలను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరు కుమార్‌ ప్రారంభించారు. ఈదీక్షల సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఇస్తున్న విధంగా కూలి రేట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న కూలి రేట్లు గత పది సంవత్సరాల ముందు నుండి ఇచ్చే రేట్లు మాత్రమేనని, ఇప్పుడు అన్ని రకాల నిత్యవసర వస్తువులపై భారీ స్థాయిలో రేట్లు పెరిగాయని, మరి వాటికి తగ్గట్టు కూలి రేట్లు ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే కూలి రేట్లు పెంచాలన్నారు. కార్మికుల పోరాటం విజయవంతం అయ్యేంత వరకు సిఐటియు రాష్ట్ర కమిటీ నుంచి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అనంతరం సిఐటియు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ పవర్లూమ్‌ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని మూలిగే నక్కపై తాటికాయబడ్డ చందంగా ఉందని అన్నారు. కరోనా సమయంలో ఉపాధి లేక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా సమయంలో ఒక దానిపై ఒకటి భారాలు మోపడం దారుణమన్నారు. రాష్ట్రప్రభుత్వం విద్యుత్‌ శ్లాబులు పెంచడం వలన భారీస్థాయిలో విద్యుత్‌ ఛార్జీలు వస్తున్నాయని, ఇంటి పన్నులు భారీ స్థాయిలో పెరిగాయన్నారు. ఇవన్నీ ఎక్కువస్థాయిలో వస్తున్నాయని సాకుతో పవర్లూమ్‌ కార్మికుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్ద అవుతున్నాయని ఇది దారుణమైన పరిస్థితి అని అన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ప్రజాప్రతినిధులను నిర్ణయించే శక్తి కార్మికులకు ఉందని అది మర్చిపోవద్దని హెచ్చరించారు. కార్మికుల గురించి పట్టించుకోకపోతే వారి పవర్‌ ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తారని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి యాజమాన్యాలతో మాట్లాడి కూలి పెంచాలని, విద్యుత్తు చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం జూలై 11న కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో తమిళనాడ పవర్‌ లూం కార్మికుల నాయకులు ప్రభాకర్‌, పుత్తూరు సిఐటియు నాయకులు వెంకటేష్‌, పవర్లూమ్‌ కార్మికులు పాల్గొన్నారు.