Jul 06,2022 23:38

మాట్లాడుతున్న సిఐటియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య

ప్రజాశక్తి- నగరి: కూలి రేట్లు పెంచాలని మరమగ్గ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె బుధవారంకు రెండో రోజుకు చేరింది. కూలిరేట్లు పెంపు విషయంలో మాస్టర్‌ వీవర్స్‌తో చర్చలు జరపడానికి తహశీల్దార్‌ చొరవ తీసుకోకపోతే సమ్మెశిబిరాన్ని తహశీల్దార్‌ కార్యాలయానికి మారుస్తామంటూ సిఐటియు నాయకులు హెచ్చరించారు. నగరి అంటేనే నేతవృత్తి గుర్తుకొస్తుందని, నేత వృత్తి మీద ఆధారపడి నగరి మండల పరిధిలో మాత్రం దాదాపు 30 వేల కుటుంబాలు ప్రత్యక్షంగాను 20 వేల కుటుంబాలు పరోక్షంగాను ఉపాధి పొందుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈడీ చార్జీల పేరిట ఒక్కో విద్యుత్‌ కనెక్షన్‌ మీద దాదాపు 1500 రూపాయలు నుంచి 4500 రూపాయల వరకు స్లాబ్‌ రేట్లను పెంచేసి మరింత భారాన్ని మోపి మరమగ్గ కార్మికుల జీవితాలును దారుణమైన పరిస్థితికి నెట్టేసిందన్నారు. రెండో రోజు సమ్మెకు మద్దతు తెలిపిన సిఐటియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ రెండు రోజులలో నగరి తహశీల్దార్‌ మాస్టర్‌ వీవర్లతో చర్చలు జరపడానికి చొరవ తీసుకోకపోతే తమ నిరోధిక సమ్మె శిబిరాన్ని నగరి తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలోకి మార్చాల్సిన పరిస్థితిని తీసుకురావద్దని హెచ్చరించారు. మరమగ్గం కార్మికుల కూలీ పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రోజా, తహశీల్దార్‌ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించకుంటే ఈనెల11వ తేదీన చిత్తూరు కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు పెరుమాళ్‌, సీఐటీయూ నాయకులు జగదీష్‌, శన్ముఘం, యువరాజ్‌, కార్తికేయన్‌, గణపతిలతో సహా దాదాపు 600మంది మరమగ్గ కార్మికులు పాల్గొన్నారు.