Jul 10,2023 21:11

జిల్లాలో వాలంటీర్ల నిరసన ర్యాలీలు
ప్రజాశక్తి - వీరవాసరం
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేసిన అనుచిత వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం వీరవాసరం తూర్పు చెరువు సెంటర్‌ వద్ద కొద్దిసేపు పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు పవన్‌కు గుర్తులేవా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆకివీడు : వాలంటీర్లపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు మహిళా వాలంటీర్లు నిరసన తెలిపారు. స్థానిక వైసిపి నాయకుల సమన్వయంతో నగర పంచాయతీ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం వారు అక్కడి నుంచి పట్టణ వీధుల గుండా ర్యాలీగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పవన్‌ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ బేషరతుగా వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వాలంటీర్లు, నేతలు, ఛైర్‌ పర్సన్‌ జామి హైమావతి పాల్గొన్నారు.
ఉండి : వాలంటీర్ల వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు చెరుకువాడ వాలంటీర్‌ చేబ్రోలు నాగమణి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా వాలంటీర్లు పనిచేశారని గుర్తు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను భేషారతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు పవన్‌ కళ్యాణ్‌ సభలను అడ్డుకుంటారని హెచ్చరించారు.