Feb 24,2023 23:19

హెచ్చరిక బోర్డులనూ తొలగిస్తున్న వైనం
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
ప్రజాశక్తి - మొగల్తూరు

                   మండలంలోని గ్రామాల్లో అనధికార లే అవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆక్రమణ దారులు ఒక్కొక్క గ్రామంలో పదుల సంఖ్యలో లే అవుట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన అది óకారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ లేఅవుట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి తమ పని పూర్తయ్యిందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఆక్రమణ దారులు హెచ్చరిక బోర్డులను ఖాతారు చేయకుండా తొలగిస్తున్నారు. అయినా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
మండల కేంద్రమైన మొగల్తూరు, పేరుపాలెంసౌత్‌, ముత్యాలపల్లి, రామన్నపాలెం, కెపిపాలెం గ్రామాల్లో సుమారు 25 అక్రమ లే అవుట్లు ఉన్నాయి. వాటికి ప్రభుత్వ అనుమతి లేదు. పంచాయతీకి పది శాతం స్థలం కేటాయించిందీ లేదు. ఆ లే అవుట్లలో ఏర్పాటుచేసిన స్థలాల క్రయ, విక్రయాలు యథేఛ్ఛగా జరు గుతున్నాయి. రోడ్లను కూడా స్థలాలు కొనుగోలు చేసు కున్నవారికి కొలతలు కొలిచి కొనుగోలుదారుల పేరున రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు.
లే అవుట్లను మెరక చేసేందుకు చేలు, తోటల్లో నుంచి మట్టి, ఇసుకను తరలిస్తున్నారు. అలా తరలించే మట్టి, ఇసుకకు మైనింగ్‌ శాఖకు సీనరేజీ చెల్లించకుండా ఎగవేస్తున్నారు. సుమారు మూడు నెలల కిందట మైనింగ్‌ శాఖాధికారులు పలు లే అవుట్లను తనిఖీచేసి నిర్వాహకులకు అపరాధ రుసుం విధించారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
మేడిది నవీన్‌కిరణ్‌, ఇఒఆర్‌డి, మొగల్తూరు
గ్రామాల్లో అనధికార లే అవుట్లు ఏర్పాటు చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటున్నాం. మొగల్తూరులో గుర్తించిన 12 అనధికార లే అవుట్ల యజమానులకు నోటీసులు జారీ చేశాం. రామన్నపాలెం, పేరుపాలెం తదితర గ్రామాల్లో ఏర్పాటుచేసిన అనధికార లే అవుట్ల యజమానులకు కూడా నోటీసులు జారీ చేస్తాం. వీటి కట్టడకి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.