Sep 25,2023 21:41

పుట్లూరు తహశీల్దార్‌ మోహన్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు

           ప్రజాశక్తి-పుట్లూరు    పుట్లూరును కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ మోహన్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వర్షాభావంతో రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పులు ఎలా కట్టాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితుల్లో ఉన్నారన్నారు. కావున వెంటనే పుట్లూరును కరువు మండలంగా ప్రకటించి సహాయ చర్యలు చేపట్టాలన్నారు. పంట రుణాలు మాఫీ చేయాలని, పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు కనీసం ఎకరాకు రూ.50వేలు, సాగు చేయని రైతలకు ఎకరాకు రూ.30వేలు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధికి ప్రతి కుటుంబానికీ రూ.25వేల ఆర్థికసాయం, ఉపాధి హామీ పథకంలో అదనంగా మరో 100రోజులు పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కౌలు రైతులకు కౌలు రద్దు చేసి నష్టపరిహారం ఇవ్వాలని, పంటల బీమాలో ప్రయివేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాన్ని రద్దు చేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, వ్యవసాయానికి 9 గంటలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం మండల కార్యదర్శి జి.వెంకటచౌదరి, నాయకులు బి.వెంకటశివారెడ్డి, ఎం.చంద్రశేఖర్‌, వై.కుళ్లాయప్ప, బెస్త అన్నయ్య, చిల్లు రాజు, అమర్‌, రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి, మండల అధ్యక్షుడు కార్యదర్శి టీ.పెద్దయ్య, భాస్కర్‌రెడ్డి, పృథ్వీ, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.