Oct 17,2023 22:17

మాట్లాడుతున్న డిసిసి అధ్యక్షులు పరమేశ్వరరావు

* డిసిసి అధ్యక్షులు పరమేశ్వరరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొస్తామని ఆ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు అన్నారు. ఇతర పార్టీల్లో ఉన్న కాంగ్రెస్‌ నాయకులను 'మన ఇంటికి రండి' నినాదంతో తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. జిల్లాలో పదేళ్లుగా ప్రజా సమస్యలను అధికార, విపక్ష ప్రజాప్రతినిధులు, నాయకులు గాలికొదిలేశారని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ నాయకుల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తన భుజస్కందాలపై డిసిసి బాధ్యతలు పెట్టిన కేంద్ర అధిష్టానం పెద్దలకు, పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జి రాకేష్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు సమిష్టి కృషి చేస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సనపల అన్నాజీరావు, పడి నాగభూషణరావు చెప్పారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా వ్యక్తిగత విమర్శలకు దూరంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో మమేకమవుతుందన్నారు. సమావేశంలో నాయకులు అంబటి కృష్ణ, కోత మధుసూదనరావు, కవిటి గోపాలకృష్ణ, డి.గోవింద మల్లిబాబు, కొత్తకోట సింహాద్రి నాయుడు, కె.వి.ఎల్‌.ఎస్‌ ఈశ్వరి, రెళ్ల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.