Feb 26,2023 19:56

కౌలు రైతు సంఘం డిమాండ్‌
ప్రజాశక్తి - వీరవాసరం
జిల్లాలో పూర్తిస్థాయిలో సాగునీరందించాలని ఎపి కౌలు రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆదివారం యుటిఎఫ్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.సుబ్బరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ జిల్లాలో పోడూరు, యలమంచిలి, నరసాపురం, వీరవాసరం, ఉండి మండలాల్లో శివారు ప్రాంతాలకు సాగునీరు అందడంలేదన్నారు. పొట్టదశలో నీరు అందకపోతే దిగుబడి తగ్గుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకరించాలన్నారు. గ్రామీణ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే సహకార సంఘాల ప్రయివేటీకరణను ప్రజలంతా వ్యతిరేకించాలన్నారు. జిల్లా కార్యదర్శి ఎం.రామాంజనేయులు మాట్లాడుతూ పంట నమోదులో సొమ్మకొడది సోకొకడి అన్న చందంగా ఉందన్నారు. కౌలు రైతులు పంట పండిస్తే దాన్ని అమ్ముకునేది భూ యజమానులంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం రైతులకు ధాన్యం సొమ్ము, కూలీ ఖర్చులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కేతా గోపాలన్‌, కవురు శ్రీనివాస్‌, పిల్లి కామేశ్వరరావు, కర్రి నాగిరెడ్డి, కేతా పూర్ణరావు, వి.పట్టాభిరామిరెడ్డి, భారతాల నాగేశ్వరావు పాల్గొన్నారు.