అనంతపురం ప్రతినిధి : పురపాలక సంఘం ఆస్తి పన్ను ద్వారా ఆదాయం లక్ష్యంలో 73.44 శాతం సాధించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అనంతపురం నగర పాలక సంస్థతోపాటు ఏడు పురపాలక సంఘాలు కలిపి మొత్తం 103.45 కోట్లు ఆస్తి పన్ను ద్వారా లక్ష్యంకాగా రూ.75.97 కోట్లు వచ్చింది. 73.44 శాతం ఆదాయం వచ్చింది. అంతకు మునుపు ఏడాది అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఏడు పురపాలక సంఘాలు కలిపి రూ.56.52 కోట్లు ఆస్తి పన్నును పురపాలక ప్రజలు చెల్లించారు. ఈ ఏడాది అది రూ.75.97 కోట్లు చెల్లించారు. గతేడాది కంటే 34.41 శాతం అధికంగా ఆదాయం వచ్చింది. అన్నింటిలోకి తాడిపత్రి అగ్రభాగాన జిల్లాలో ఉంది. నగర పాలక సంస్థల్లో రాష్ట్రంలోనే అనంతపురం నగర పాలక సంస్థ మూడవ స్థానంలో ఉంది.
జిల్లాలో తాడిపత్రి టాప్
అనంతపురం జిల్లా పరిధిలో ఏడు పురపాలక సంఘాల్లో తాడిపత్రి పురపాలక సంఘం ఆదాయం టాప్ ఉంది. తాడిపత్రి పురపాలక సంఘం ఆస్తి పన్ను లక్ష్యం రూ.8.98 కోట్లు కాగా 7.96 కోట్లు వచ్చింది. 88.60 శాతం ఆదాయం వచ్చింది. అనంతపురం నగర పాలక సంస్థలో రూ.60.11 కోట్లుకాగా రూ.48.43 కోట్లు అంటే 80.60 శాతం ఆదాయం వచ్చింది. గుత్తి పురపాలక సంఘంలో రూ.4.83 కోట్లుకాగా రూ.3.39 కోట్లు 70.20 శాతం పన్నులు వసూళ్ల అయ్యాయి. గుంతకల్లు పురపాలక సంఘం రూ.15.02 కోట్లకుగానూ రూ.10.03 కోట్లుకాగా 66.80 శాతం ఆదాయం వచ్చింది. రాయదుర్గం పురపాలక సంఘంలో రూ.4.87 కోట్లకుగానూ రూ.3.13 కోట్లు ఆదాయం 64.30 శాతం వచ్చింది. కళ్యాణదుర్గం పురపాలక సంఘం పరిధిలో రూ.5.70 కోట్లకుగానూ రూ.3.05 కోట్లు , 53.50 శాతం ఆస్తి పన్ను వసూలైంది. పామిడి పురపాలక సంఘంలో రూ.3.93 కోట్లకుగానూ 0.01 కోట్లు అంటే 0.10 శాతమే వసూలైంది. మొత్తంగా చూసినప్పుడు 73.44 శాతం వసూలైంది. అంతకు మునుపు ఏడాది రూ.54.52 కోట్లు అయింది. ఈసారి అంతకు మించి అధికంగా ఆదాయపు పన్ను వసూలైంది.
నగర పాలక సంస్థల్లో 'అనంత'లో మూడవ స్థానం
నగర పాలక సంస్థల్లో చూసినప్పుడు అనంతపురం నగర పాలక సంస్థ రాష్ట్రంలోనే ఆదాయపు పన్ను వసూళ్లలో మూడవ స్థానంలో నిలిచింది. మొత్తం 17 నగర పాలక సంస్థలున్నాయి ఇందులో తాడేపల్లి మొదటి స్థానంలో 82.20 శాతం ఉండగా, కర్నూలు రెండవ స్థానం 81.60 శాతం, ఆ తరువాత అనంతపురం నగర పాలక సంస్థ 80.60 శాతం కలిపి మొత్తంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.34.33 కోట్లు మాత్రమే అనంతపురం నగర పాలక సంస్థకు ఆదాయం వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి రూ.48.43 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే గతేడాది కంటే 41.10 శాతం అధికంగా ఆస్తి పన్నును పురపాలకవాసులు చెల్లించారు.










