పుంగనూరులో వైసిపిని భూస్థాపితం చేస్తా
- పులివెందుల రాజకీయాలు కుప్పంలో వద్దు
- ఉద్రిక్తతల నడుమే సాగిన చంద్రబాబు పర్యటన
ప్రజాశక్తి - కుప్పం: 'కుప్పంలో పులివెందుల రాజకీయాలు వద్దు... మూడేళ్లలో కుప్పంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి... పుంగనూరులో వైసిపిని భూస్థాపితం చేస్తా' అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బెంగుళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తొలిరోజు రామకుప్పం మండలంలో పర్యటించారు. అయితే కొల్లుపల్లి గ్రామంలో టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య బ్యానర్ల విషయమై రగడ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దాదాపు గంటకు పైగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కార్యకర్తలతో పాటు పోలీసులూ గాయపడ్డారు.
కొల్లుపల్లి ఘటన అనంతరం బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోడానికి తాను వచ్చానని, టిడిపి హయాంలో కుప్పం అభివృద్ధి చెందిందన్నారు. చెల్దిగానిపల్లిలో దేశంలోనే పైలెట్ ప్రాజెక్టుగా బిందుసేద్యాన్ని ప్రారంభించామన్నారు. అప్పట్లో దేశం మెచ్చిన బిందుసేద్యం ఇపుడు నామరూపాలు లేకుండా చేశారన్నారు. ప్రతి ఒక్క రైతుకూ మీటర్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చామన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏమి చేశారో చూపించాలన్నారు. తీవ్రవాదులతో పోరాడిన గుండె తనదని, రౌడీలకు భయపడతానా? అని ప్రశ్నించారు. కుప్పంలో పులివెందుల రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. పుంగనూరులో వైసిపిని భూస్థాపితం చేస్తానన్నారు. జనాలు వైసిపిని ఛీ కొడుతున్నారన్నారు. రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలని, భయపెడతాం అంటే భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. ఆడబిడ్డలు వంట చేసుకునే పరిస్థితి లేకుండా అన్ని రేట్లు పెంచేశారన్నారు. 175 గెలుస్తామని చెబుతున్న జగన్, మొదట పులివెందులలో గెలిచి చూపించాలన్నారు. లేపాక్షి లో 8500 ఎకరాలు ఒక కంపెనీకి వైస్ రాజశేఖర్ అప్పనంగా కట్టబెడితే, వారినుండి జగన్‌కి డబ్బులు ముట్టాయని, ఆ కేసులో 18 ఛార్జ్ షీట్లు వేస్తే 16 నెలలు జైలుకెళ్లాడన్నారు. జడ్‌ప్లస్ కేటగిరీ ఉన్న తనకు భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలమవుతున్నారన్నారు. ఒక ఎంపి బట్టలు విప్పిన వీడియోలు వస్తుంటే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలన్నారు. మందలించాల్సిన ప్రభుత్వం వత్తాసు పలుకుతోందన్నారు. రిషికొండను మొత్తం దోచేస్తున్నారన్నారు. బ్రిటీష్ వాళ్లకంటే ఘోరంగా అరాచకాలు చేస్తున్నారన్నారు.










