పుంగనూరులో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్/ పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలపై మాట్లాడే వారిపై పోలీసులు 30 యాక్ట్ పేరుతో ఉక్కు పాదం మోపడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు మండిపడ్డారు. చిత్తూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సమస్యలపై ప్రతి పౌరునికీ మాట్లాడే హక్కు ఉందన్నారు. రాజ్యాంగానికి అతీతంగా పుంగనూరు నియోజకవర్గం ఉందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడే అక్కడ కూడా వ్యవహరించాలన్నారు. పోలీసులు అత్యుత్సాహం చూపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఈ పద్ధతిని వెంటనే మానుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని, ప్రధానంగా రైతులు, పాల రైతులు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఇలాంటి సందర్భంలో వారి సమస్యలను ప్రస్తావించే వారి గొంతు నొక్కడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలకు ఓ రకంగా, అధికారంలోకి వచ్చిన పార్టీలకు ఒక రకంగా పోలీసులు వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రామచంద్ర యాదవ్ ఇంటిపై భౌతిక దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న మంత్రి : టిడిపి
మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని తెలుగుదేశం నేతలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాత్రి పోలీసుల సమక్షంలోనే పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటిలోకి 200 మంది వై కా పా గూండాలు దూరి కార్లను , ఇంటిలోని ఫర్నిచర్‌ను, వస్తువులను ధ్వంసం చేసి, వీరంగం చేసి భయానక వాతావరణం సష్టించి కుటుంబ సభ్యులను , ప్రజలను భయభ్రాంతులను చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి మెప్పు పొందటానికి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశాంత పుంగనూరులో అరాచకాలా..?
ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న పుంగనూరులో అరాచకాలు దాడులు అలజడులు సష్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు అన్నారు. ఆదివారం రాత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచర గణం రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేసి కోట్ల రూపాయల ఆస్తి నష్టం చేయడంపై సోమవారం బీసీ సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు సందర్శించి తీవ్రంగా ఖండించారు. పుంగనూరు ఎప్పుడు ప్రశాంతతకు మారుపేరని ఇలాంటి చోట దౌర్జన్య కాండ చేపడితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దురదష్టకరమన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శి నాగరాజు, జనార్ధన్, పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ,జనసేన జిల్లా నాయకులు పసుపులేటి హరిప్రసాద్ ఈ ఘటనను ఖండించారు.










