Feb 19,2022 21:30

కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాలు జిల్లాలో అమలు చేయడంలో మన జిల్లా మొదటి స్థానంలో ఉన్నామని, ఉపాధి కల్పనతో పాటు కరువు నివారణ పనులు చేపట్టడం జరుగుతోందని కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లాలో ఉపాధి పనులతో పాటు 14,15వ ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు మంజూరు, ఖర్చులు, పిఎంజిఎస్‌ పనులకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి బృంద సభ్యులు ఎంకె.గుప్తా, వందన శర్మలతో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడవడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయని అన్నారు. కరువు నివారణ కోసం రోజుకు లక్ష పనిదినాలు కల్పించడం జరుగుతోందని, అదేవిధంగా కరువు నివారణ కోసం ఇప్పటి వరకు జిల్లాలో ఉద్యానపంటలుగా మామిడి 1.12లక్షల హెక్టార్లలో పూత దశలో ఉందన్నారు. అలాగే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలివ్వడం ద్వారా వారు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని తెలిపారు. రూర్బన్‌ పథకం ద్వారా మంచినీటి వనరులను పెంచి స్వచ్ఛమైన నీరు ప్రజలకు ఇవ్వడానికి ఎంతో ఉపకరిస్తోందని తెలిపారు. గ్రామాలలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈపథకం ద్వారా చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా నిర్ణయించిన గ్రామాలు అభివృద్ధిపథంలో వెళ్లేందుకు ఉపకరిస్తోందని అదేవిధంగా జిల్లాలో 1.7లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడం, లబ్దిదారులకు ఇంటి పట్టాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొత్తంగా 52వేల గృహ నిర్మాణాలు బేస్మెంట్‌ స్థాయి దాటాయని, ఇప్పటి వరకు రూ.400కోట్లు వెచ్చించినట్లు కలెక్టర్‌ సభ్యులకు తెలిపారు. కార్యక్రమంలో జెసి అభివృద్ధి సిహెచ్‌ శ్రీథర్‌, డ్వామా పిడి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.