ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు
ప్రజాశక్తి - నరసాపురం
పట్టణాభివృద్ధి, సుందరీకరణకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పని చేసి మంచి ఫలితాలు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం స్థానిక ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావుతో ప్రభుత్వ చీఫ్ విప్, ఎంఎల్‌ఎ ముదునూరి ప్రసాదరాజు పట్టణాభివృద్ధి, సుందరీకరణపై సమావేశం నిర్వహించారు. ప్రసాదరాజు మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యం నిర్వహణ మెరుగుపరచాలని సూచించారు. ఏఒక్క వార్డులోనూ పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ప్రజలు, కౌన్సిలర్ల నుంచి ఏఒక్క ఫిర్యాదూ రాకూడదని స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి పారిశుధ్య కార్మికుల నియామకాలు చేపట్టాలన్నారు. రహదారుల పక్కన, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల అవరణలో మొక్కలు నాటాలన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.62 కోట్లు పట్టణంలో ఖర్చు చేయబోతున్నామని, పనులకు టెండర్లు పిలిచామని ఆయన తెలిపారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.217 కోట్లు వ్యయం అంచనా వేశామని, మొదటి విడతలో ఒకటి నుంచి తొమ్మిది వార్డులకు రూ.87 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పెండింగ్ పనులపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రసాదరాజు ఆదేశించారు.










