Aug 19,2022 23:11

రాళ్ళు, పిచ్చిమొక్కలతో దర్శనం ఇస్తున్న తిమ్మసముద్రం జగన్న లేఅవుట్‌

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
పేదల సొంతంటి కల నేరవేర్చేందుకు నవరత్నాల్లో భాగంగా పేదలందరికి జగనన్న ఇళ్ళు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అర్హులను గుర్తించి పట్టాలు పంపిణీ చేశారు. అయితే జగనన్న కాలనీల పేరుతో ఇంటి స్థలం లేని పేదలకు ప్రభుత్వం మంజురు చేసిన జగనన్న కాలనీల్లో మౌళిక వసతులు అంతమాత్రంగా ఉండటంతో లబ్దిదార్లు ఇండ్లు నిర్మించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
లేఅవుట్లో పిచ్చిమొక్కలు

చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలో జగనన్న కాలనీల పేరుతో తొమ్మిది లేఅవుట్లు వేసి పేదలకు ఇంటిస్థలాలను పంపిణీ చేశారు. పదే పదే నివాసయోగ్యమైన స్థలాలు పంపిణి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా నగరానికి అత్యంత దూరంలో నిర్జీవ ప్రాంతాల్లో రాళ్లతో నిండిపోయిన గుట్టలను ఇంటిస్థలాల కోసం కేటాయించడంతో దొడ్డిపల్లి, తిమ్మసముద్రం, చెన్నమ్మగుడిపల్లి ప్రాంతాల్లోని జగనన్న కాలనీల్లో ఇప్పటి వరకు ఒక్క పునాదిరాయి పడలేదు. కనీస మౌళిక వసతులైన నీరు, విద్యుత్‌, డ్రైనీజి వ్యవస్థ లేకపోవడంతో లబ్దిదార్లు ఇబ్బందులకు గురౌతున్నారు. విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు పేరుతో సబ్‌స్టేషన్లు ఏర్పాటు సిమెంట్‌ దిమ్మెలకు మాత్రమే పరిమితమైంది. నిర్మాణాలు ప్రారంభించిన కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని కోనుగోలు చేయాల్సివస్తోందని లబ్దిదార్లు వాపోతున్నారు. ట్యాంకర్‌ నీటికి రూ. 450 ఖర్చు చేయాల్సి వస్తోందని, రోడ్డు సౌకర్యం లేక ట్యాకర్లుకు కూడా రావడం లేదంటున్నారు. దాదాపు మూడు వేల మందికి ఇంటి స్థలాలు మంజురు చేస్తే 50 శాతం కూడా నిర్మాణాలు ప్రారంభించలేదని సమాచారం. కొన్ని లేఅవుట్లలో రోడ్లుకు ఇరువైపులా మొక్కలు నాటినా నీరు పోసే దిక్కులేక ఎండిపోతున్నాయి.
పట్టాలిచ్చి చేతులు దులుపుకున్నారు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా గత ఏడాది జనవరిలో ఇంటిస్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పట్టాలు పొందిన వారంతా సొంత ఇంటి కలలు కన్నారు. ఏడాదికి పైగా అవుతున్నా నామమాత్రంగానే గృహనిర్మాణాలు పూర్తి చేశారు. వివిధ దశల్లో అనేక కాలనీల్లో దర్శనం ఇస్తున్నాయి. లేఅవుట్లలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి ఎవరి ఏ ప్లాటో గుర్తించడం కష్టంగా మారింది. ఈ పరిస్థిల్లో చేతిల్లో ఉన్న డబ్బులు పోసి ఇల్లు నిర్మించుకున్నా మౌళిక వసతులు లేని కాలనీల్లో ఎలా ఉంటామనే అనుమానంతో కొందరు గృహనిర్మాణాలకు ముందుకు రావడంలేదు. తిమ్మసముద్రం జగనన్న కాలనీ అవుట్‌లో 300 గృహాలు మంజురు చేశారు. నేటి వరకు ఒక్కరంటే ఒక్కరు గృహనిర్మాణాన్ని ప్రారంభించలేదు. గృహ నిర్మాణాలపై పదేపదే సమీక్షలు జరుపుతున్న అధికారులు మౌళిక వసతుల కల్పినపై దృష్టి సారించాలని లబ్దిదార్లు కోరుతున్నారు.