Mar 23,2023 21:04

ప్రజాశక్తి - ఆచంట
పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పత్రికా రంగ అస్తిత్వాన్ని పరిరక్షించాలని, పాత్రికేయులపై దాడులను అరికట్టాలని ఐజెయు మాజీ నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యులు కొలిశెట్టి వీరవెంకట తాతారావు తెలిపారు. గురువారం సేవ్‌ జర్నలిజం డే కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ తహశీల్దార్‌కు విలేకరులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ ప్రతిరోజూ జర్నలిస్టులపై ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. జర్నలిస్టులందరూ ఐకమత్యంగా ఉండి జర్నలిజం వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా ఆచంట నియోజకవర్గ అధ్యక్షులు వనం సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోడపాటి నాగేశ్వరరావు, పరువు మోహన్‌, కె.సాగర్‌, ఎంఎపి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
నరసాపురం : ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌, ఎపి డబ్ల్యూజె పిలుపుమేరకు నరసాపురం ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు తరపట్ల ఇజ్రాయిల్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్‌కలెక్టర్‌ సూర్యతేజకు ప్రెస్‌క్లబ్‌ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలతో సంబంధం లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, కరోనా సమయంలో మరణించిన జర్నలిస్టు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని తెలిపారు. ప్రజలకు వార్తలు చేరవేయడంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వినతిపత్రంపై సబ్‌కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ప్రెస్‌క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.
తణుకురూరల్‌ : పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల భద్రతకు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు బెల్లంకొండ బుచ్చిబాబు, కొడమంచిలి కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. షహీద్‌ భగత్‌సింగ్‌ వర్థంతిని పురస్కరించుకుని ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ పిలుపు మేరకు ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో గురువారం తణుకు ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సేవ్‌ జర్నలిజం డే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ పిఎన్‌డి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్‌ సంస్థల ఆదిపత్యం నుండి మీడియాను తప్పించాలన్నారు. ఐటి నిబంధనల ముసుగులో డిజిటల్‌ మీడియాకు సమస్యలను సృష్టించడం మానుకోవాలన్నారు. అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టి.దొరబాబు, తులా భాస్కర్‌, బి.శ్రీనివాస్‌, ఎసిఎన్‌ రాజా, ఆర్‌.బద్రి, ఆకేటి.రాంబాబు, డి.శ్రీనివాస్‌, అనుకుమార్‌, సిహెచ్‌డి.రాజశేఖర్‌, ఎంవి.కుమార్‌, సతీష్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : పత్రికారంగాన్ని కాపాడుకోవాలని ఐజెయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్‌ డిమాండ్‌ చేశారు. భగత్‌సింగ్‌ వర్థంతి సందర్భంగా గురువారం 'సేవ్‌ జర్నలిజం డే' నిర్వహించారు. ఈ మేరకు గూడెం ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో సిపాయిపేట భవననిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు చిక్కాల రామకృష్ణ, ఐజెయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు ఓసూరి వీర్రాజు, సిఐటియు నాయకులు చింతకాయల బాబూరావు, బీమా ఉద్యోగుల సంఘం సీనియర్‌ నాయకుడు జి.బాపయ్యశర్మ, తదితరులు మాట్లాడారు. పత్రికారంగాన్ని కాపాడుకుంటేనే ప్రజాస్వామ్య హక్కులు నిలుస్తాయన్నారు. అనంతరం ప్రెస్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి మృతికి తొలుత సంతాపం తెలిపి, భగత్‌ సింగ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.