Apr 03,2023 18:13

గుమ్మలూరులో తాగునీటి కోసం ప్రజల అవస్థలు
ప్రజాశక్తి - పోడూరు
మండలంలోనే పెద్ద పంచాయతీలో ఒక్కటైన గుమ్మలూరు గ్రామంలో తాగునీటి కోసం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కుళాయి ద్వారా సరఫరా చేసే నీరు పూర్తిగా పసరు రంగులో ఉండి మట్టి వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుమ్మలూరు పంచాయతీలో దాదాపు 5 వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. అయితే సమస్య గురించి ఎన్నిసార్లు అధికారులకు, సర్పంచికి మొర పెట్టుకున్నా ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు. రోజుకు ఒక్కపూట మాత్రమే కుళాయి నీరు ఇస్తున్నారని, అవి కూడా పూర్తిగా తాగడానికి పనికిరావని వాపోతున్నారు. రోజూ ద్విచక్ర వాహనాలపై 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లు మున్సిపాల్టీ నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని వాపోతున్నారు. అంతదూరం వెళ్లి నీరు తెచ్చుకోలేని వారు ఈ నీటినే తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి శుద్ధి చేసిన తాగునీరు అందిచాలని కోరారు.