పలమనేరు బాలిక ఘటనలో జరిగింది ఇదే
పోటీతత్వం వల్ల జరిగిన అనర్థమిది
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
మార్కుల ధ్యాస తప్ప ఇతర వాటిపై దృష్టి కూడా మరల్చడానికి లేకుండా రోబోల వలే విద్యాబోధన సాగుతోంది. నలుగురితో మెలగడం ఎలా.. అందరితో ఆనందంగా ఉండడం ఎలా అనే విషయాలు విద్యాసంస్థలు నేర్పించడం మానేశాయి. మానసిక వికాసాన్ని పెంపొందించడాన్ని పూర్తిగా గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. పలమనేరులో ముస్లీం బాలిక ఆత్మహత్య ఘటనలో జరిగింది ఇదే. ర్యాంకులు, మార్కులు దీనికి తోడు మూఢ నమ్మకాలు వల్ల ఒక విద్యార్థి ప్రాణాలు పోయాయి. మరో విద్యార్థిని దోషిగా నిలబడేటట్లు చేసింది.
పలమనేరులో పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య ఘటనలో ఆ పాఠశాల ప్రిన్సిపాలే అసలు దోషి అని ఇప్పటికే తేటతెల్లమైంది. ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదాన్ని సక్రమంగా పరిష్కరించకపోవడం వల్లే ఓ విద్యార్థి నిండు ప్రాణాలు పోవడానికి కారణమైంది. దీనిపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రయివేటు పాఠశాలలు తమ స్వలాభం కోసం ప్రయత్నిస్తున్నాయి తప్ప సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కేస్తున్నాయి అనే దానిపై ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది.
పలమనేరులో బ్రహ్మర్షి పాఠశాలకు చెందిన విద్యార్థి మిస్బా (14) రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఇందులో అనేక విషయాలు బయటకు వచ్చాయి. వాస్తవానికి మిస్బా, పూజిత ప్రాణ స్నేహితులు. ఇద్దరూ బాగా చదువుతారు. ఒకరంటే ఒకరికి ఇష్టం. పండగలకు, తమ ఇండ్లలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. ఇలా వీరి స్నేహం విడదీయలేని విధంగా సాగుతూ వచ్చింది. కాగా రెండు నెలల క్రితం మిస్బాకు అనారోగ్యంగా ఉంటే ముక్కుకు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో పాఠశాలకు రాలేకపోయింది. రెండు నెలల తరువాత వచ్చినా మిస్బా యథా ప్రకారం చదువుల్లో రాణిస్తూ వచ్చింది. ఏ పరీక్ష నిర్వహించినా అందులో ప్రథమంగానే వచ్చేది. ఆఖరుకు ప్రాజెక్టు వర్కులో కూడా తనదే పై చేయిగా నిలిచేది. ఇక్కడి పాఠశాలలోని ఉపాధ్యాయులు కూడా ఈ అమ్మాయిని చూపించి అందరూ ఇలా చదువుకోవాలని చెప్పేవారు. ఈ క్రమంలో మిస్బాను ఆరోగ్యం కుదుట పడితే మొక్కుబడి నేపథ్యంలో దర్గాకు తీసుకెళ్లి తల్లిదండ్రులు వచ్చారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపైన ఇద్దరు స్నేహితుల మధ్య భిన్నాభిప్రాయలు వచ్చాయి. దీంతో పూజిత మిస్బాతో మాట్లాడడం మానేసింది. ఇంట్లో కూడా పూజిత ముభావంగా ఉంటూ వచ్చింది. దీనిపై తల్లిదండ్రులు నిలదీయడంతో మిస్బాతో తలెత్తిన గొడవను చెప్పింది. ఈ విషయాన్ని పూజిత తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకొచ్చారు.
ప్రిన్సిపాల్ వల్లే అంతా
ఈ సందర్భంగా సున్నితమైన అంశాన్ని సక్రమంగా పరిష్కరించలేకుండా పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ వింతవింతగా ప్రవర్తించారు. మిస్బా తల్లిదండ్రులను ఇబ్బంది కరంగా మాట్లాడారు. గోటితో పోయే విషయాన్ని తెగేదాకా లాగారు. మిస్బాను వేరే పాఠశాలకు తీసుకెళ్లాలని, అక్కడే కొన్ని రోజులు ఉంచాలని చెప్పి పంపేశారు. ఆదర్శ పాఠశాలలో కూడా ఆ విద్యార్థిని ఇమడ లేకపోవడంతో ఇక్కడున్న కరస్పాండెంట్ కూడా మిస్బాను అక్కడి నుంచి పంపేశారు. దీంతో రెండు పాఠశాలల్లోనూ పంపేయడంతో ఆ అమ్మాయి తల్లడిల్లిపోయింది. తన అభిప్రాయలను ఎవరితో పంచుకోవాలో తెలీక లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది.
ఆది నుంచీ రమేష్ ప్రవర్తన వివాదమే
బ్రహ్మర్షి పాఠశాల ప్రిన్సిఫాల్ ఆది నుంచి వివాదాస్పదుడుగా పేరుంది. ఈయన గంగవరం మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూలులో హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అయినా ఈయన తన భార్య పేరుతో పలమనేరులో ప్రైవేట్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీలున్నాయని, గతంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈయన తీరు వల్లే ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
రమేష్‌పైన వేటు.. అరెస్టు
బ్రహ్మర్షి పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యపై పలమనేరు పోలీసులు ప్రాథమిక విచారణలో పరోక్షంగా కారణమై కేసు నమోదు కావడంతో విధుల నుండి సస్పెండు చేస్తున్నట్లు డిఇఓ శేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇతన్ని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.










