Mar 25,2023 22:42

27, 28 తేదీల్లో సిపిఐ రిలే నిరాహార దీక్షలు
ప్రజాశక్తి - భీమవరం

               పోలవరం ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 45.72 మీటర్ల కాంటూరు ఎత్తుతో పూర్తి స్థాయిలో నిర్మించాలని, నిర్వాసితులందరికీ పునరావాసం, పరిహారం చెల్లించాలని కోరుతూ ఈ నెల 27, 28 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కె.భీమారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండు రోజుల రిలే దీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని దీక్షలు విజయవంతం చేయాలని కోరారు.
క్రైస్తవులను ఎస్‌సిలుగా గుర్తించడానికి పోరాడాలి
భీమవరం :దళిత క్రైస్తవులను ఎస్‌లుగా గుర్తించాలని కేవలం తీర్మానించి వదిలేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంపై కూడా పోరాడాలని కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల విజయకుమార్‌, కె.క్రాంతిబాబు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీలో ఎన్నిసార్లు ఈ అంశంపై తీర్మానం చేసినా కేవలం రాష్ట్ర ప్రజల మెప్పు పొందడానికి చూస్తున్నారే తప్ప ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించి అమలు చేసేలా ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు.
రోడ్ల అభివృద్ధి వేగవంతం
భీమవరం రూరల్‌ :వచ్చేనెల మొదటి వారంలో తాడేరు వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం ఆర్‌అండ్‌బి శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ తాడేరు వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.30 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. భీమవరం నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బి శాఖ నిధులతో చేపట్టిన రోడ్ల పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో జెడ్‌పిటిసి సభ్యులు కాండ్రేగుల నరసింహరావు, ఆర్‌అండ్‌బి శాఖ ఇఇ లోకేశ్వరరావు, డిఇ రామరాజు, జెఇ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
మొగల్తూరులో రామ్‌చరణ్‌ పుట్టినరోజు వేడుక
మొగల్తూరు :గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మరెన్నో విజయాలను అందుకోవాలని మెగాస్టార్‌ చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు కోపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మొగల్తూరులోని చిరంజీవి గ్రంథాలయం వద్ద రామ్‌ చరణ్‌ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కోసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి కృష్ణాజి, గన్నాబత్తుల రామ్‌కుమార్‌, ముక్కు గిరి, లక్కు బాబి, గుగ్గిలపు శివరామకృష్ణ పాల్గొన్నారు.
విద్యార్థులకు పోషకాహారం అందించాలి
ఉండి :విద్యార్థులకు పోషకాహారం అందించడమే జగన్‌ లక్ష్యమని మధ్యాహ్నం భోజన పథకం జిల్లా కోఆర్డినేటర్‌ కె.కృష్ణారావు అన్నారు. ఉండి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఆయన శనివారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ, పాఠశాలలోని టాయిలెట్ల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.బేబి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేడు ఉగాది ఉత్సవాల పురస్కారాలు
గణపవరం :గణపవరం పద్మినిపురం కళాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక కన్యకా పరమేశ్వరి వర్తక సంఘ భవనంలో కళాకారులకు, కవులకు ఉగాది ఉత్సవాల పురస్కారాలు అందిస్తున్నట్లు పద్మినిపురం కళాపీఠం గౌరవ అధ్యక్షులు రుద్రరాజు వెంకట సూర్యనారాయణ రాజు అన్నపూర్ణమ్మ దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు భీమవరానికి చెందిన సత్యనారాయణరాజుకు సన్మానం చేస్తామని చెప్పారు.
కాళ్ల : పారిశుధ్య పల్లెలే లక్ష్యంగా చెత్త సేకరణపై మరింత దృష్టి సారించాలని ఇఒపిఆర్‌డి ఎంవి.భాస్కరరావు అన్నారు. జక్కరం గ్రామంలో శనివారం తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచి కూచంపూడి పద్మావతి అధ్యక్షత వహించారు. జక్కరం డంపింగ్‌ యార్డ్‌ లో పండిస్తున్న ఆకుకూరలను కూరగాయలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈడూరు సర్పంచి ఎంవిఎన్‌ఎస్‌ఎస్‌.రామలింగరాజు, నౌడూరు సర్పంచి నల్లమిల్లి రేణుక, జక్కరం ఉప సర్పంచి కూచంపూడి లక్ష్మీపతి రాజు, గ్రామ కార్యదర్శి ఎస్‌కె.జమాల్‌ పాల్గొన్నారు.
24 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
ఉండి :పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఉండి, ఉప్పులూరు, మహదేవపట్నం, యండగండి గ్రామాల్లోని పశు వైద్యశాలల్లో శనివారం ప్రారంభించారు. ఏప్రిల్‌ 24వ తేదీ వరకు వేయనున్నట్లు తెలిపారు.
పాలకోడేరు : మండల పరిధిలో ఆయా గ్రామాల్లో గాలి కుంటు టీకాలు వేసే కార్యక్రమాన్ని పశు వైద్యులు శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ రాజు(చంటి రాజు) ప్రారంభించారు. మండల పశువైద్యులు మౌర్య, హేమ, సిబ్బంది పాల్గొన్నారు.
మొగల్తూరు : మండలంలోని కొత్తపాలెం, కెపి.పాలెం గ్రామాల్లో గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని పశువైద్యులు నీలిమ ప్రారంభించారు. పశువులకు టీకాలు వేశారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
పోడూరు :ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను స్థానిక ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు శనివారం పరామర్శించారు. జిన్నూరు గ్రామంలో బుడి కృష్ణ, మెరుగని ఏడుకొండలు కుటుంబసభ్యులను, వేడంగి గ్రామంలో యర్రంశెట్టి పెదకాపు, తోట నాగేశ్వరరావు, పోడూరు సూర్యనారాయణ కుటుంబాలను పరామర్శించారు. ఆయనతో పాటు మండల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, యర్రంశెట్టి పద్మారావు పాల్గొన్నారు.
నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం
పాలకోడేరు :33 కెవి విద్యుత్‌ లైన్ల నిర్మాణం నిమిత్తం ఆదివారం పెన్నాడ, శృంగవృక్షం, బంటుమిల్లి, విస్సాకోడేరు, గొరగనమూడి, గొరగనమూడిపాలెం, కొండేపూడి, వేండ్ర పలు గ్రామాల్లో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పీర్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.